నల్లగొండ ప్రతినిధి, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : అవునన్నా, కాదన్నా… రైతుబంధు పథకంతోనే రాష్ట్రంలో సాగు విస్తీర్ణంతోపాటు పంటల ఉత్పత్తి బాగా పెరిగిందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. ఇతర పథకాల సంగతి ఏమో గానీ రైతుభరోసా పథకాన్ని మాత్రం కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని అన్నారు. మంగళవారం నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు రెండు ఎకరాల భూమికి రైతుభరోసా డబ్బులు జమ చేశారని, మిగిలిన రైతులకు కూడా త్వరలోనే పూర్తి చేయాలని కోరారు. నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల సమాఖ్యకు సంబంధించిన మదర్ డెయిరీ ఆస్తులను విక్రయించాలన్న నిర్ణయం సరైంది కాదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
సంస్థకు నష్టాలు వస్తున్నాయన్న పేరుతో ఆస్తులు అమ్ముకుంటూపోతే చివరకు మదర్ డెయిరీ అమ్ముకోవాల్సి పరిస్థితి రావచ్చని హెచ్చరించారు. ఆస్తుల అమ్మకమే పరిష్కారం కాదని, పరిమితికి మించిన ఖర్చును నియంత్రించుకోవాలని, నిజాయితీగా సంస్థ కోసం పని చేయాలని సూచించారు. నష్టాలు వస్తుంటే 250 మంది సిబ్బందిని పర్మినెంట్ చేయడం ఎందుకని ప్రశ్నిస్తూ వీటిపై ప్రభుత్వం, డెయిరీ పాలక వర్గం సరైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యేల అనర్హత అంశం సుప్రీం కోర్టు పరిధిలో ఉందని, దానిపై తానేమీ స్పందించబోనని తెలిపారు. గతంలో మాదిరిగా బీపీఎల్తోపాటు ఏపీఎల్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టాలని చెప్పారు. ఈ విషయమై తాను ఇదివరకే సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి లేఖ రాసినట్టు తెలిపారు. దీనివల్ల రేషన్ కార్డులకు ఉన్న డిమాండ్ కొంత తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.