 
                                                            మహాముత్తారం, అక్టోబర్ 30 : ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిన రూ.2లక్షల రుణమాఫీ కాని రైతులకు బ్యాంకర్లు నోటీసులు పంపిస్తున్నారు. తమకు అన్ని అర్హతలున్నా ప్రభుత్వం రుణమాఫీ చేయలేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహా ముత్తారం మండలంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకు, పీఏసీఎస్ బ్యాంకులో 2300 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. వీరిలో నాలుగు విడతల్లో 800 మందికి రుణమాఫీ కాగా, ఇంకా 1500 మంది రైతులకు కాలేదు.
వీరికి రూ.23 కోట్ల రుణమాఫీ ప్రభుత్వం చేయాల్సి ఉన్నది. రుణమాఫీ కాని రైతుల్లో సెప్టెంబర్‌లో 35 మందికి, అక్టోబర్‌లో 31 మందికి నోటీసులు పంపించారు. నవంబర్‌కు సంబంధించి రైతులకు పంపేందుకు నోటీసులు ప్రింట్ చేసి పెట్టారు. నోటీసులు అందించేందుకు రైతుల ఇంటికి వెళ్తున్న బ్యాంకు అధికారులకు ‘మాకు రుణమాఫీ కాలేదు.. మా రుణమాఫీ మంత్రి శ్రీధర్‌బాబు, రేవంత్‌రెడ్డి’ చెల్లిస్తారని అన్నదాతలు చెబుతున్నారు.
 
                            