హైదరాబాద్, అక్టోబర్ 19(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 5,566 కి.మీ.మేర రోడ్ల అభివృద్ధి లక్ష్యం.. రూ.10,547 కోట్ల వ్యయం.. 32 ప్యాకేజీలుగా పనులు.. తొలుత 10 ప్యాకేజీ పనులకు ఆమోదం.. ఒక్కో ప్యాకేజీకి సుమారు రూ.300 కోట్లకు పైగా మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపులు.. ఇదీ హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్ల ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ హడావుడి. ఈ నేపథ్యంలో సర్కార్ అత్యుత్సాహం సర్వత్రా అనుమానాలకు తావిస్తున్నది. రాష్ట్రంలో హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడల్) రోడ్ల ప్రాజెక్టుపై అధికారులు, కాంట్రాక్టర్లలో తొలి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, రాష్ట్ర సర్కార్ మాత్రం ముందుకే సాగుతున్నది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇంత భారీ ప్రాజెక్టు ఆచరణ యోగ్యం కాదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నా, పట్టింపేలేకుండా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నది. ఇలాంటి దశలో తొలివిడత హ్యామ్ రోడ్లకు ఏకంగా క్యాబినెట్ ఆమోదమే తెలిపింది. ఈ ఆతృతను బట్టి ఈ ప్రాజెక్టు వెనుక ఏదో మతలబు దాగి ఉన్నదని, ప్రజాధనాన్ని బడా కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే దీనిని చెపడుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. దశాబ్దాలుగా రోడ్ల పనులు చేసుకుంటూ బతుకుతున్న చిరు కంట్రాక్టర్లను లేకుండా చేసి.. పనులన్నీ బడా ఏజెన్సీలకే అప్పగించేందుకు పకడ్బందీ ప్రణాళికతో సర్కారు భారీ కుట్రకు తెరతీసిందని ప్రచారం జరుగుతున్నది.
32 ప్యాకేజీలుగా పనులు చేపట్టాలని నిర్ణయించిన సర్కారు.. మొదటి దశలో 10 ప్యాకేజీలకు వెంటనే టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి పనులు చేపడుతామని వెల్లడించింది. ఈ 10 ప్యాకేజీలకు ఒకేసారి మొబిలైజేషన్ అడ్వాన్సులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక్కో ప్యాకేజీ కనీసం రూ.300 కోట్లకు పైగా ఉండేలా ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు.. ఆ పనులు దక్కించుకునే ఏజెన్సీలకు ముందుగానే మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో ప్రీ-బిడ్ సమావేశం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సమావేశం సందర్భంగా ప్రభుత్వ కుట్రపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉన్నది.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్అండ్బీ పరిధిలో రోడ్ల మరమ్మతుల నుంచి వంతెనల నిర్మాణం వరకు పనులు చేపట్టే కాంట్రాక్టర్ల సంఖ్య 1000 మందికి పైగా ఉన్నది. ఇందులో 90 శాతం కాంట్రాక్టర్లు రూ.1 కోటిలోపు విలువైన పనులు చేపట్టేవారు ఉంటారు. మరో 8 శాతం మంది రూ.50 కోట్ల లోపు విలువచేసే పనులు చేపట్టే సామర్థ్యం ఉన్నవారు ఉంటారు. అంతకుమించి వ్యయం అయ్యే పనులు చేపట్టే ఏజెన్సీల సంఖ్య కేవలం 2శాతం మాత్రమే ఉన్నది. ఆర్అండ్బీ శాఖలో రూ.10 కోట్లకన్నా తక్కువ వ్యయమయ్యే పనులే ఎక్కువగా ఉంటాయి. ఇందులో రోడ్ల మరమ్మతులు, కల్వర్టుల నిర్మాణం వంటి పను లు ఉంటాయి. రూ.10 నుంచి రూ.50 కోట్లలోపు పనులు దక్కించుకునే ఏజెన్సీలు సైతం చాలావరకు తమ పనులను చిన్న కాంట్రాక్టర్లకే సబ్-కాంట్రాక్టు కింద ఇస్తాయి. దీంతో చిన్న కాంట్రాక్టర్లకు ఏడాదిపాటు చేతినిండా పని లభించడమే కాకుండా రోడ్ల మరమ్మతులు కూడా ఎప్పటికప్పుడు పూర్తవుతాయి.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం చిన్న కాంట్రాక్టర్లు చేసే పనులన్నీ కొందరు ఎంపిక చేసిన బడా కాంట్రాక్టర్లకు ధారాదత్తం చేసేందుకు హ్యామ్ పేరుతో పక్కా ప్రణాళికలు రూపొందించిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే రాష్ట్ర రహదారుల పనులకు హ్యామ్ విధానాన్ని చేపట్టడం ఏమిటని పలువురు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. రోడ్డు నిర్మాణమే కాకుండా 15 ఏండ్ల పాటు నిర్వహణ బాధ్యతలు కూడా సదరు ఏజెన్సీకే అప్పగించాలని నిర్ణయించడం వెనుక భారీ కుట్రకోణం దాగి ఉన్నదని పలువురు అనుమానిస్తున్నారు. దీనివల్ల తాము సొంతంగా పనులు చేపట్టే అవకాశం లేకుండా పోతుందని, బడా ఏజెన్సీలు గుడ్‌విల్ తీసుకొని చిన్నా చితకా పనులను తమకు అప్పగిస్తాయని చిన్న కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
సహజంగా జాతీయ రహదారుల ప్రాథికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) ఆధ్వర్యంలో చేపట్టే రోడ్ల ఉన్నతీకరణ పనులను హ్యామ్ విధానంలో చేపడుతారు. దీనికి అయ్యే ఖర్చు పూర్తిగా ఏజెన్సీలే భరిస్తాయి. అనంతరం టోల్ విధానం ద్వారా ఆ ఖర్చును తిరిగి రాబట్టుకుంటాయి. రాష్ట్రస్థాయిలో ఉండే రోడ్ల అభివృద్ధి, మరమ్మతు పనులు ఆయా రాష్ర్టాలే తమ సొంత నిధులతో చేపడుతాయి. దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ సర్కారు హ్యామ్ విధాన స్వరూపాన్నే మార్చివేసి రాష్ట్ర రహదారుల అభివృద్ధికి ఈ విధానాన్ని చేపడుతుండటం గమనార్హం. హ్యామ్ విధానంలో 40 శాతం సర్కారు, మిగతా 60శాతం ఖర్చు ఏజెన్సీలు భరిస్తాయి. తెలంగాణలో చేపడుతున్న విధానంలో మాత్రం సర్కారు భరించాల్సిన 40శాతమే కాకుండా ఏజెన్సీ ఖర్చుచేయాల్సిన మిగతా 60శాతం కూడా సర్కారే భరిస్తుందని చెప్తున్నారు. దీన్నిబట్టి సర్కారే మొత్తం ఖర్చును భరిస్తున్నప్పుడు దీన్ని హ్యామ్ విధానమని ఎందుకు అంటున్నారో అర్థం కావడమే లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ప్రభుత్వం చెల్లించాల్సిన 40శాతం నిధులను టెండర్లు ఖరారైన వెంటనే మొదట మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా చెల్లించాలని నిర్ణయించారు. ఏజెన్సీలు వెచ్చించే 60 శాతం నిధులకు కూడా బ్యాంకు గ్యారంటీగా ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో బడా ఏజెన్సీలు తమ జేబు నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం ఇచ్చే నిధులతోనే పనులు చేపట్టి లాభాలు పొందుతాయని, ఒకవేళ మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నాక ఏజెన్సీలు చేతులెత్తేసినా ప్రభుత్వం చేసేదేమీ ఉండదని పలువురు పేర్కొంటున్నారు.
ఆర్అండ్బీ శాఖ పరిధిలో ఇప్పటివరకు రూ.1 కోటికన్నా తక్కువ విలువైన పనుల పెండింగ్ బిల్లులే రూ.800 కోట్ల వరకూ ఉన్నాయి. కాంగ్రెస్ సర్కారు వచ్చినప్పటి నుంచి రోడ్ల మరమ్మతు పనులకు నిధులు విడుదల చేయడమే లేదు. రూ.800 కోట్ల పెండింగ్ బిల్లులే చెల్లించలేని సర్కారు.. హ్యామ్ రోడ్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌గా 10 ప్యాకేజీలకు రూ.300 కోట్ల చొప్పున అడ్వాన్సులు ఎలా చెల్లిస్తుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. దీంతో సర్కారు కొందరు బడా కాంట్రాక్టర్లకు మేలు చేసేందుకే ఈ విధానాన్ని చేపట్టిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.