ఖైరతాబాద్, జూన్ 30 : ప్రత్యేక రాష్ట్రం ఏ ర్పడి పన్నేండేండ్లు కావొస్తున్నా ఇంకా బుద్ధి మారని కొందరు ఇక్కడి అస్తిత్వంపై దాడులు చేస్తూనే ఉన్నారని, అలాంటి వాటిని సహించే ది లేదని వక్తలు స్పష్టంచేశారు. తెలంగాణ డిజిటల్ జర్నలిస్ట్స్ సంఘం ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ భాష-చరిత్ర దాని మూలాలు’ అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీనియర్ సంపాదకులు కట్టా శేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రాచీనమైనది.. ఆంధ్ర అనేది భాషకాదని అన్నా రు. నన్నయ కాలం నుంచే తెలుగు భాష ఉందనడం సరికాదని, అంతకంటే కొన్ని శతాబ్దాల ముందే తెలుగు ఉనికిలో ఉందనడానికి చారిత్రమైన ఆధారాలున్నాయని తెలిపారు. అసలు ఆంధ్రులు ఇక్కడి వాళ్లే కాదని పేర్కొన్నారు. రచయిత, సాహితీవేత్త నందిని సిధారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ అస్తిత్వం, భాషపై సాంస్కృతిక దాడులు సహించబోమని, ఈ దాడులు ఈ నాటివి కావని, కొన్నేండ్లుగా భౌతికంగా, సాంస్కృతికంగా జరుగుతూనే ఉన్నాయని తెలిపారు.
ఇటీవల ఇడుపు కాయితం టైటిల్‌ను అడ్డం పెట్టుకొని కొందరు గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారని విమర్శించా రు. సినిమా రంగం ఇంకా కొందరి చేతుల్లోనే ఉండటం వల్ల థియేటర్ల కేటాయింపుల్లో తెలంగాణ చిత్రాలపై కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ తెలుగు ఎంతో శాస్త్రీయమైనదని, సంపన్నమైనదని, గరికపాటి లాంటి వారు కూడా అంగీకరించారని గుర్తుచేశారు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోని సామెతల్లో, నుడికారాల్లో ఉన్న అద్భుతమైన అర్థం, సామాజిక స్పృహ మరెక్కడా లేదని కొనియాడారు. తెలంగాణ డిజిటల్ జర్నలిస్టుల సంఘం ప్రతినిధి సుంకరి ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సినీ దర్శకుడు లక్ష్మణ్, తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృధ్వీరాజ్ యాదవ్, జర్నలిస్టులు శంకర్, శ్రీనివాస్, శ్రీనిధి పాల్గొన్నారు.