హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కొన్ని విభాగాల్లో కీలక ఫైళ్లు మాయం అవుతున్నాయంటూ ఇటీవల తరుచూ వార్తలు వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. 2014 నుంచి ఇప్పటివరకు అన్ని రకాల పేపర్, డిజిటల్ దస్ర్తాలను జాగ్రత్తగా కాపాడాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఆ బాధ్యతను సంబంధిత శాఖల కార్యదర్శులు చూసుకోవాలని స్పష్టం చేశారు. స్వయంగా సమీక్షించి ముఖ్యమైన, సున్నితమైన ఫైళ్ల పరిస్థితి ఏమిటి..? ఏవైనా మాయం అయ్యాయా..? అనేది గుర్తించాలని సూచించారు. సిబ్బందిలో ఏ ఒక్కరూ ఆఫీస్ నుంచి ఫైళ్లు తీసుకెళ్లొద్దని స్పష్టం చేశారు. ఏవైనా ఫైళ్లు మాయమయితే సెక్షన్ ఆఫీసర్లదే బాధ్యత అని, బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వెల్లడించారు.