హైదరాబాద్, ఫిబ్రవరి 29 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ పరీక్షాకేంద్రాల్లో మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఆదేశించారు. ఆదిలాబాద్ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకొన్న నేపథ్యంలో గురువారం ఆయన ఆ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారులు, నోడల్ అధికారులు, ప్రిన్సిపాళ్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లా స్థాయిలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల్లో ఒత్తిడిని నివారించాలని, టెలిమానస్ హెల్ప్లైన్ల నంబర్లకు విస్తృత ప్రాచుర్యం కల్పించాలని సూచించారు. విద్యార్థులు సాధ్యమైనంత త్వరగా పరీక్షాకేంద్రాలకు చేరుకోవాలని ఆయన సూచించారు. ఏవైనా సమస్యలుంటే.. జిల్లా, రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌లను సంప్రదించాలన్నారు. సమీక్షలో ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతిఓజా, పరీక్షల విభాగం కంట్రోలర్ జయప్రదా బాయి.. పరీక్షల విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
2.87 శాతం గైర్హాజరు..
సెకండియర్ విద్యార్థులకు రెండో భాష పేపర్ -2 పరీక్ష గురువారం నిర్వహించారు. మొత్తం 4,55,536 మంది విద్యార్థులకు 4,42,451 విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. దీంతో 13,085 (2.87శాతం) విద్యార్థులు పరీక్ష రాయలేదు. పలు జిల్లాల్లో అధికారులు తనిఖీలు నిర్వహించినట్టు ఇంటర్‌బోర్డు కార్యదర్శి శృతిఓజా వెల్లడించారు. ఖమ్మం జిల్లాలో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడుతుండగా, అధికారులు గుర్తించి సంబంధిత విద్యార్థిపై చర్యలు తీసుకొన్నారు.