CP Sudheer Babu | హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 23 (నమస్తే తెలంగాణ): రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నేరాలు పెరిగాయి. నిరుటితో పోలిస్తే ఈ ఏడాది 4% అధికంగా నేరాలు నమోదయ్యాయి. వీటిలో హత్యలు, కిడ్నాప్‌లు, రేప్ కేసులు ఎక్కువగా ఉన్నట్టు సోమవారం విడుదల చేసిన 2024 వార్షిక నివేదికలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు. నేరస్థులకు శిక్ష పడేలా చూడటంలో రాచకొండ పోలీస్ కమిషనరేట్ 64% కన్విక్షన్ రేటుతో వరుసగా ఆరో ఏడాది అగ్రస్థానంలో నిలిచినట్టు తెలిపారు.
ఈ ఏడాది డయల్ 100కు 2,41,742 కాల్స్ వచ్చాయని, విజిబుల్ పోలీసింగ్, క్షేత్ర స్థాయిలో ముమ్మర పెట్రోలింగ్ నిర్వహిస్తుండటం, డయల్ 100కు వస్తున్న కాల్స్‌పై వేగంగా ప్రతిస్పందిస్తుండటంతో చాలావరకు నేరాలు తగ్గాయని చెప్పారు. నిరుటితో పోలిస్తే ఈసారి రోడ్డు ప్రమాదాల కేసులు 12.3%, మహిళలపై దాడులు 9% తగ్గాయని, వీటితోపాటు దోపిడీలు, దొంగతనాలు కూడా తగ్గినప్పటికీ ఆస్తి నష్టం పెరిగిందని పేర్కొన్నారు.
ఇదే సమయంలో సైబర్‌నేరాలు 42.5% పెరిగాయని, ఈ ఏడాది 53 మంది విదేశీయులు, అంతరాష్ట్ర సైబర్నేరగాళ్లను అరెస్టు చేశామని తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో రూ.23.12 కోట్లు ఫ్రీజ్ చేశామని, బాధితులకు రూ.21.94 కోట్లు రిఫండ్ చేయించామని వివరించారు.
ఈ ఏడాది మాదకద్రవ్యాల సరఫరాకు సంబందించిన 253 కేసుల్లో 521 మందిని అరెస్టుచేసి రూ.88.35 లక్షల విలువైన డ్రగ్స్‌ను సీజ్ చేసినట్లు సీపీ వెల్లడించారు. మహిళ అక్రమ రవాణాకు సంబంధించిన 33 కేసుల్లో 61 మందిని అరెస్టుచేసి 34 మంది బాధితులను కాపాడినట్టు తెలిపారు. గేమింగ్ యాక్ట్ కింద నమోదైన 236 కేసుల్లో 1,486 మందిని అరెస్ట్ చేసి కోటి రూపాయలు సీజ్ చేసినట్టు చెప్పారు.