హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగా ణ): రాష్ట్రంలో నేరాలను కట్టడి చేసేందుకు ఇకనుంచి ప్రతినెలా ప్రత్యక్షంగా, వర్చువల్‌గా క్రైమ్ రివ్యూలు నిర్వహించాలని డీజీపీ జితేందర్ పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. నేరాల తీరును విశ్లేషించడం, కొత్త చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన భద్రతను కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంగళవారం డీజీపీ ఆఫీసు లో అర్ధవార్షిక సమీక్ష నిర్వహించారు. గత 6 నెలల్లో జరిగిన దారుణాలను డీజీపీ ఈ సమావేశంలో ప్రస్తావిస్తూ.. పలు జిల్లాల ఎస్పీలు, కమిషనర్లపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్న రౌడీ లు, ఇతర అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రజలతో సత్సంబంధాలు పెంపొందించుకోవడంలో పోలీసులు విఫలమతున్నారని ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. ఈ ధోరణిని వెంటనే మార్చుకోవాలని హితవు పలికారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలతోపాటు సైబర్, మాదకద్రవ్యాల అక్రమ రవాణా నేరాలను సమర్థంగా నిరోధించకపోతే ఎవరినీ ఉపేక్షించేది లేదని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డుప్రమాదాల నివారణపై దృష్టిపెట్టాలని, అన్ని వర్గాల ప్రజలతో రోడ్డు భద్రతా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.
టైమ్‌కు ఎందుకు చేరుకోలేకపోతున్నారు?
రాష్ట్రంలో డయల్ 100 ప్రతిస్పందన సమ యం దారుణంగా పడిపోయిందని డీజీపీ జితేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. సకాలంలో బాధితుల వద్దకు ఎందుకు చేరుకోలేకపోతున్నారని ప్రశ్నించారు. డయల్ 100 రెస్పాన్స్ టైమ్ ను మెరుగుపర్చేందుకు పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 6 నెలల నుంచి కొందరు పోలీసుల పనితీరు సరిగా లేకపోవడం వల్ల మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వచ్చిందని మండిపడ్డారు. ఇకనుంచైనా శాంతిభద్రతల నిర్వహణలో అందరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. ప్రస్తుతం ఇతర రాష్ర్టాల్లో నక్సల్స్‌పై విస్తృతంగా దాడులు జరుగుతున్నందున వారు తెలంగాణలోకి రాకుండా అడ్డుకునేందుకు ఇంటెలిజెన్స్ అధికారులు, కూంబింగ్ పార్టీలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.
విభాగాల వారీగా నివేదికలు
సైబర్ నేరాలు, సెల్ఫోన్ల దొంగతనాలు, మానవ అక్రమ రవాణా, వాహనాల చోరీ, తదితర అంశాలపై సీఐడీ ఏడీజీ శిఖాగోయెల్.. మాదకద్రవ్యాల అక్రమ రవాణాను నిరోధించేందుకు చేపడుతున్న చర్యలపై టీజీఏఎన్‌బీ డైరెక్టర్ సందీప్ శాండిల్య డీజీపీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇతర అంశాలపై ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ బీ శివధర్‌రెడ్డి, అడిషనల్ డీజీలు అభిలాష బిస్త్ (ట్రైనింగ్), వీవీ శ్రీనివాసరావు (టెక్నికల్ సర్వీసెస్), విజయ్ కుమార్ (పర్సనల్, వెల్ఫేర్), సంజయ్ కుమార్ జైన్ (బెటాలియన్స్) నివేదికలు సమర్పించారు. 27 హత్యలు, 6 అత్యాచారాలకు సంబంధించిన కేసుల్లో దోషులకు జీవిత ఖైదు పడేలా చర్యలు చేపట్టిన 36 మంది అధికారులు, 30 మంది ప్రాసిక్యూటర్లకు ఈ సమావేశంలో డీజీపీ ప్రశంసాపత్రాలు అందజేశారు.