Telangana Crime Rate | పాలన గాడి తప్పింది. ప్రభుత్వం చేతులెత్తేసింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు రక్తమోడుతున్నాయి. నియంత్రించాల్సిన పోలీసులు రాజకీయ వేధింపుల్లో పావులుగా మారి అక్రమ కేసులు మెడకు చుట్టే పనుల్లో తలమునకలై ఉన్నారు. సోషల్ మీడియా పోస్టుల మీద నిఘా పెట్టి.. లా అండ్ ఆర్డర్‌ను గాలికొదిలేశారు. ఫలితంగా కరడుగట్టిన అంతర్రాష్ట్ర ముఠాలు పేట్రేగిపోతున్నాయి. నడిరోడ్డుపై కత్తులతో నరికిచంపుకోవడాలు నిత్యకృత్యమయ్యాయి. రాష్ట్రంలో భయంకరమైన నేరాలు 172శాతం పెరిగాయని, జాతీయ సగటు రేటు కన్నా తెలంగాణలోనే నేరాలు అధికమని జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ)-2024 నివేదిక స్పష్టంచేసింది. అన్నట్టు మన రాష్ట్ర హోంశాఖ మంత్రి ఎవరో తెలుసా..? ఇంకెవరు.. సీఎం రేవంతే!
హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశాబ్దంలో భౌగోళికంగా, ఆర్థికంగా ఎంతో పురోగతి సాధించినా, శాంతిభద్రతలను అదుపులో పెట్టినా.. రెండున్నరేండ్లుగా రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ ఒక క్లిష్టమైన సవాలుగా మారింది. రాజధాని హైదరాబాద్‌లోని సంపన్న ప్రాంతాల నుంచి మారుమూల జిల్లాల వరకు వరుసగా జరుగుతున్న హత్యలు, పగటిపూట దోపిడీలు, మహిళలు, చిన్నారులపై పెరుగుతున్న లైంగికదాడులు సామాన్య ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రత్యేకించి పారిశ్రామికంగా, సాంకేతికంగా దూసుకుపోతున్న రాష్ట్రంలో నేరాల రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.
ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం, తెలంగాణలో నేరాల నమోదు రేటు పొరుగు రాష్ర్టాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు కంటే ఎక్కువగా ఉన్నది. 2024లో తెలంగాణలో మొత్తం 2,17,976 కాగ్నిజబుల్ నేరాలు (ఐపీసీ, బీఎన్ఎస్, ఎస్ఎల్ఎల్ కలిపి) నమోదయ్యాయి. 2023లో నమోదైన 1,83,644 కేసులతో పోలిస్తే ఇది 18.7% పెరుగుదలను సూచిస్తున్నది. రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకూ నేరాల రేటు 568.9గా ఉన్నది. ఇది జాతీయ సగటు 418.9 కంటే చాలా ఎక్కువ. కేరళ, గుజరాత్, తమిళనాడు వంటి రాష్ర్టాలు మాత్రమే తెలంగాణ కంటే ఎక్కువ నేరాల రేటును కలిగి ఉన్నాయి. అయితే, ఉత్తరప్రదేశ్ (296.6), కర్ణాటక (290.6) వంటి పెద్ద రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో నేరాల నమోదు గణనీయంగా ఎక్కువ ఉండటం గమనార్హం.
సికింద్రాబాద్‌లో బీటెక్ విద్యార్థి దారుణ హత్య
మే 7న రాత్రి సికింద్రాబాద్‌లోని చిలకలగూడలో 23 ఏండ్ల బీటెక్ విద్యార్థి యవన్ హత్యకు గురయ్యాడు. జవహర్ నగర్‌కు చెందిన యవన్ తన స్నేహితులతో కలిసి క్రికెట్ మ్యాచ్ చూస్తుండగా, బైక్‌లపై వచ్చిన నలుగురు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి కత్తులతో దాడి చేశారు. బాధితుడు తప్పించుకోవడానికి రోడ్డుపై పరుగెత్తినా నిందితులు వెంటాడి మరీ మెడ, తల భాగాల్లో పొడిచి చంపారు. ఈ హత్య వెనుక ప్రేమ వ్యవహారం, అమ్మాయి కుటుంబ సభ్యుల పాత్ర ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పట్టపగలే, జనం చూస్తుండగానే ఇలాంటి దాడులు జరుగడం సమాజంలో పెరుగుతున్న నేర ప్రవృత్తికి అద్దం పడుతున్నది. బాధితుడి కుటుంబ సభ్యులు సీతాఫల్‌మండిలోని యువతి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఈ వరుస ఘటనలతో పోలీసులంటే నేరస్తుల్లో భయం ఏమాత్రం లేదని అర్థమవుతున్నది.
రాజకీయ హింస, ప్రతిపక్ష నేతలపై దాడులు
రాష్ట్రంలో రాజకీయ వైషమ్యాలు కూడా శాంతిభద్రతల సమస్యగా మారుతున్నాయి. గురువారం కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంపు ఆఫీసుపై బీజేపీ కార్యకర్తలు దాడి చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ దాడులు జరిగాయి. కౌశిక్‌రెడ్డి వాహనాన్ని పోలీసుల ఎదుటే ధ్వంసం చేశారు. ప్రతిపక్ష నేతల ఇండ్లపై దాడులు చేస్తున్నా.. వారి వాహనాలను ధ్వంసం చేస్తున్నా.. కొన్ని చోట్ల భౌతిక దాడులకు తెగబడుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు.
సైబర్ నేరాల్లో దేశంలోనే నం.1
టెక్నాలజీ పరంగా ముందంజలో ఉన్న తెలంగాణ.. ఇప్పుడు సైబర్ నేరాలకు కూడా అడ్డాగా మారుతున్నది. 2024లో రాష్ట్రంలో సైబర్ నేరాలు 49% పెరిగాయి. మొత్తం 27,230 సైబర్ కేసులు నమోదు కాగా, అందులో అత్యధికంగా మోసం, చీటింగ్ కేసులు ఉన్నాయి. హైదరాబాద్ నగరంలో సైబర్ నేరాలు 17% తగ్గినట్టు గణాంకాలు చెప్తున్నా, రాష్ట్రవ్యాప్తంగా వీటి తీవ్రత పెరుగుతూనే ఉన్నది. పోలీసు విచారణలో 16,084 కేసులకు సంబంధించి నివేదికలు సమర్పించినా, కేవలం 3,177 కేసుల్లోనే చార్జిషీట్లు దాఖలు కావడం దర్యాప్తులోని జాప్యాన్ని సూచిస్తున్నది. 2025లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ద్వారా 2,491 హానికరమైన యూఆర్ఎల్లను గుర్తించి, 1,311 లింకులను తొలగించారు. అలాగే 8,979 ఐఎంఈఐ నంబర్లను, 8,856 సిమ్ కార్డులను బ్లాక్ చేశారు. అయినా రోజుకో కొత్త పంథాలో సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. తెలంగాణ పౌరులు ప్రతియేటా కోట్లాది రూపాయలు నష్టపోతూనే ఉన్నారు.
డ్రగ్స్ మహమ్మారితో ఉడ్తా తెలంగాణగా
తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నా క్షేత్రస్థాయిలో డ్రగ్స్ వినియోగం అరికట్టలేకపోతున్నది. నగరంలో నడిరోడ్లపైనే యువత యథేచ్ఛగా గంజాయి సేవిస్తున్నది. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున గంజాయి, సింథటిక్ డ్రగ్స్ పట్టుబడుతున్నాయి. మాదకద్రవ్యాల ముఠాలను అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈగల్ ఫోర్స్’ మామూళ్లకు అలవాటు పడిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2025 వార్షిక నివేదిక ప్రకారం, మాదకద్రవ్యాల కేసులు గణనీయంగా పెరిగాయి. 2023లో 1,464 కేసులు నమోదు కాగా.. 2025 నాటికి 2,734కి డ్రగ్స్ కేసులు చేరాయి. 2023లో 3,157 కాగా, 2025లో 5,703 మందిని అరెస్ట్ చేశారు. నైజీరియా, ఘనా, సూడాన్ దేశాలకు చెందిన 93 మంది విదేశీయులను డ్రగ్స్ సరఫరా, మనీ లాండరింగ్ ఆరోపణలపై బహిష్కరించారు. అయినా డ్రగ్స్ సరఫరా తగ్గలేదు.. వాటి వినియోగం ఏమాత్రం కట్టడి కాలేదు. సింథటిక్ డ్రగ్స్ తయారీలో వాడే ఎసిటిక్ అన్హైడ్రైడ్ వంటి రసాయనాలను పారిశ్రామిక ప్రాంతాలైన చర్లపల్లి, నాచారంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మహిళలు, చిన్నారులపై నేరాలు
మహిళల భద్రత విషయంలో తెలంగాణ గణంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2024 ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం దక్షిణ భారతదేశంలో మహిళలపై అత్యధిక నేరాలు నమోదవుతున్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. 2024లో మహిళలపై 24,495 నేరాలు నమోదు కాగా, అందులో భర్త లేదా బంధువుల వేధింపులు 28.4% ఉన్నాయి. చిన్నారులపై లైంగిక దాడులు (పోక్సో కేసులు) కూడా ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. లైంగిదాడి కేసుల్లో 98.03% నిందితులు బాధితులకు తెలిసిన వారే ఉండటం సామాజిక విశ్లేషకులను కలవరపెడుతున్నది. వీటి పరిష్కారానికి రాష్ట్రంలో 400 ప్రత్యేక పోక్సో కోర్టులు పనిచేస్తున్నాయి. అయినా నేరస్తుల్లో ఎలాంటి భయం కనిపించడం లేదు.
ఆయుధాలతో దోపిడీలు..
నేరగాళ్లు ఇప్పుడు కేవలం చిన్న దొంగతనాలకే పరిమితం కాకుండా, భారీ స్థాయిలో ఆయుధాలతో దోపిడీలకు పాల్పడుతున్నారు. మే 3న కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీ షాపులో జరిగిన సాయుధ దోపిడీ ఇందుకు నిదర్శనం. ఐదుగురు సభ్యుల ముఠా కస్టమర్ల వేషంలో షాపులోకి ప్రవేశించి, తుపాకులతో సిబ్బందిని బెదిరించి కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో సేల్స్ మేనేజర్, మరో ముగ్గురు ఉద్యోగులు గాయపడ్డారు. సుమారు కిలో బంగారాన్ని దోచుకున్న ఈ ముఠా, ముందస్తుగా ధర్మపురి, పెద్దపల్లి ప్రాంతాల్లోని లాడ్జీల్లో బస చేసి రెక్కీ నిర్వహించినట్టు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు తాము భవన నిర్మాణ కార్మికులమని నమ్మించి ఐడెంటిటీ కార్డులు సమర్పించి లాడ్జీల్లో గదులు తీసుకున్నారు. వీరు ఎలాంటి మాస్కులు కూడా ధరించకుండా, ఎలాంటి భయం లేకుండా దర్జాగా కాల్పులు జరిపారంటే.. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ, పోలీసుశాఖ వైఫల్యమే. కాగా, నిందితులు గుజరాత్ నుంచి దేశాన్ని విడిచిపోయినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో ఎంత పెద్ద నేరం జరిగినా పోలీసులు కేవలం గంటల వ్యవధిలోనే వారిని అరెస్టు చేసేవారు. ఇప్పుడు ఘటన జరిగి 5 రోజులు గడుస్తున్నా ఎలాంటి క్లూ దొరుకలేదు కదా.. సముద్ర మార్గం నుంచి దేశం దాటి వెళ్లారని సాక్షాత్తూ పోలీసు వర్గాలే లీకులిస్తున్నాయి. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, సీసీటీవీ నిఘా ఉన్నా నేరగాళ్లు భయపడటం లేదని విమర్శించారు.
సంచలనం సృష్టిస్తున్న హత్యలు
రాష్ట్రంలో హత్యలు, లైంగికదాడులు, దోపిడీల వంటి తీవ్రమైన నేరాల స్వభావం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నది. 2025లో హత్యల సంఖ్య 781గా నమోదు కాగా, లైంగికదాడి కేసులు 2,549గా నమోదయ్యాయి. కొద్ది కాలంగా తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్, సెంట్రల్ రీజియన్లలో జరుగుతున్న హత్యలు నేరగాళ్ల తెగింపును బట్టబయలు చేస్తున్నాయి. రద్దీగా ఉండే రోడ్లపై పట్టపగలే హత్యలు జరుగడం శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పోలీసులంటే భయం లేదు.. ప్రభుత్వమంటే పట్టింపే లేదు. శుక్రవారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు నివాసం ఉండే ప్రాంతంలో జరిగిన హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, రిటైర్డ్ డైరెక్టర్ జనరల్ వినయ్ రంజన్ రాయ్ భార్య తనుజా రంజన్ (55) తన నివాసంలోనే హత్యకు గురయ్యారు. వినయ్ రంజన్ రాయ్ వ్యక్తిగత పని మీద బెంగళూరు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. దుండగులు ఆమెను నోటిలో గుడ్డలు కుక్కి ఊపిరాడకుండా చేసి చంపినట్టు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా 8 నెలలుగా ఆ ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ డొమెస్టిక్ హెల్పర్ (పనిమనిషి)ను గుర్తించారు. నిందితురాలు తన ముఠాతో కలిసి పథకం ప్రకారం విలువైన వస్తువులు దోచుకెళ్లినట్టు గుర్తించారు.
రాష్ట్రం సిద్ధించిన తర్వాత.. శాంతి భద్రతలతో పరిఢవిల్లిన తెలంగాణ.. నేడు నేరాలకు అడ్డాగా మారింది. ఎటుచూసినా దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, లైంగికదాడులతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ హయాంలో శాంతిభద్రతల్లో అగ్రగామిగా ఉన్న తెలంగాణ ఇప్పడు అశాంతి, అభద్రతతో కొట్టుమిట్టాడుతున్నది. ప్రజాపాలన అంటూ అధికారం చేపట్టిన కాంగ్రెస్.. పాలనపై పట్టు కోల్పోవడంతో తెలంగాణ అల్లకల్లోలంగా మారింది.
15 రోజులుగా జరుగుతున్న దారుణాలతో రాష్ట్రమంతా కలవరపడుతున్నది. కొద్ది రోజులుగా చోటుచేసుకుంటున్న హత్యలు, దోపిడీలు, భౌతిక దాడులు నేరగాళ్ల తెగింపును బట్టబయలు చేస్తున్నాయి. రద్దీగా ఉండే రోడ్లపై పట్టపగలే హత్యలు జరుగడం శాంతిభద్రతల వైఫల్యానికి నిదర్శంగా నిలుస్తున్నాయి.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఏకంగా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు నివాసం ఉండే ప్రాంతంలోనే జరిగిన హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. గురువారం రాత్రి సికింద్రాబాద్ చిలకలగూడలో 23 ఏండ్ల బీటెక్ విద్యార్థిని నడి రోడ్డుపై దుండగులు కత్తులతో పొడిచి చంపారు. పోలీసుల పటిష్ట నిఘా లేకపోవడంతో దొంగలు కొద్దిరోజులుగా పేట్రేగిపోతున్నారు.
ఇటీవల కరీంనగర్‌లోని నగల షాపులో దోపిడీ ముఠా నలుగురు సిబ్బందిపై తుపాకులతో కాల్పులు జరిపి దాదాపు కిలో బంగారం ఎత్తుకుపోయింది. అప్పట్లో హైదరాబాద్‌లోనూ పట్టపగలే చందానగర్ నగల దుకాణంలో జరిగిన దోపిడీ, ఏటీఎం ధ్వంసం లాంటి ఘటనలు సంచలనం సృష్టించాయి. మరోవైపు రాష్ట్రంలో రాజకీయ వైషమ్యాలు పెరిగి భౌతికదాడులకూ దారితీస్తున్నాయి. గురువారం కరీంనగర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేసి ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వాహనాన్ని ధ్వంసం చేస్తున్నా పోలీసులు చేష్టలుడిగి చూస్తూ ఉండటం తీవ్ర విమర్శలకు దారితీసింది. రాష్ట్రంలో క్రైమ్ రేట్ పెరిగిందని, యువత మత్తుకు బానిసగా మరుతున్నదని స్వయంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వెల్లడించడం కాంగ్రెస్ సర్కార్ పనితీరుకు అద్దం పడుతున్నది.
2024లో రాష్ట్రంలో మొత్తం నమోదైన నేరాలు 2,17,976