రాష్ట్రంలో పెరిగిన క్రైం రేట్ 9.87%
రేప్ కేసుల్లో పెరుగుదల 28.94%
ఎస్సీ/ఎస్టీలపై పెరిగిన నేరాలు 20.24%
వివిధ కేసుల్లో శిక్షల రేటు – 27.67%
వివిధ రకాల దోపిడీల్లో పెరుగుదల: 33.65%
డయల్ 100 రెస్పాన్స్ టైం 15 నిమిషాలు
మూడు గంటలకో రేప్.. ఐదు గంటలకో కిడ్నాప్.. ఏడు గంటలకో హత్య.. రాష్ట్రంలో సగటున నమోదవుతున్న నేరాలివి.
నిరుటితో పోలిస్తే ఈ ఏడాది తెలంగాణలో నేరాల సంఖ్య భారీగా పెరిగింది. మరోవైపు నేరగాళ్లకు శిక్షలు విధించే రేటు తగ్గిపోయింది. శాంతి భద్రతల పర్యవేక్షణా వైఫల్యం, తక్షణం ఆదేశాలిచ్చే వ్యవస్థ లోపించడంతో క్రైమ్‌రేటు దారుణంగా పెరిగింది. దొంగతనాలు, దోపిడీలు సగటున గంటకు ఏడు చొప్పున చోటుచేసుకుంటున్నాయి. శాంతిభద్రతల వ్యవస్థ గాడి తప్పిందనేందుకు ప్రభుత్వ గణాంకాలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Crime Rate | హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో క్రైం రేట్ దారుణంగా పెరిగింది. తీవ్రమైన నేరాలు నిరుటి కంటే ఈ ఏడాది అత్యధికంగా 22.53శాతం పెరిగాయి. అంతర్రాష్ట్ర దొంగలు రాష్ట్రంలో తిష్టవేశారని పోలీసులను, ప్రభుత్వాన్ని మీడియా జాగృత పర్చినా.. క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవడంతో రాష్ట్రంలో సగటున ప్రతిరోజూ 78 చొప్పున వివిధ రకాల దొంగతనాలు జరుగుతున్నాయి. ఇక ఈ ఏడాది రాష్ట్రంలో కిరాయి హత్యల సంఖ్య భారీగా పెరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరుకు, శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పట్టే వివరాలను డీజీపీ జితేందర్ ఆదివారం వార్షిక క్రైం నివేదిక రూపంలో వెల్లడించారు.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది మొదటి 11 నెలల్లో అన్ని రకాల నేరాలు 10శాతం పెరిగినట్టు ఆ నివేదిక వెల్లడించింది. ఇందులో తీవ్రమైన నేరాలు 22.53 శాతం పెరగడం ఆందోళనకరం. పోలీసు శాఖ తమ పనితనాన్ని కప్పిపుచ్చుకొనేందుకు మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి 2020లో జరిగిన నేరాలతో 2024లో జరిగిన వాటి సంఖ్యను పోల్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో నేరాల పెరుగుదల శాతాన్ని తగ్గించి చూపేందుకు ‘నెట్ వేరియేషన్’ అనే ఆప్షన్ పెట్టింది. దీనిపై మీడియా వేసిన ప్రశ్నలకు డీజీపీ సమాధానం చెప్పలేక సీఐడీ డీజీ శిఖాగోయెల్ను చెప్పమని కోరారు. ఆమె ఇచ్చిన సమాధానంతో పాత్రికేయులు సంతృప్తి చెందలేదు.
రాష్ట్రంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలపై నేరాల సంఖ్య దారుణంగా పెరిగింది. గతంతో పోల్చితే రేప్కేసులు 2945 (28.94%), మహిళల హత్యలు 13.15శాతం పెరిగాయి. ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులు 363 పెరిగాయి. దీంతో మహిళలను కంటికి రెప్పలా చూసుకుంటున్నామని చెప్తున్న మాటలు నీటిమూటలేనని తేలిపోయింది. ఇక ఎస్సీలు, ఎస్టీలపై జరిగిన నేరాలు ప్రభుత్వ నిర్లక్ష్యపూరితమైన పాలనకు అద్దం పడుతున్నాయని నిపుణులు విమర్శిస్తున్నారు. నిరుడు ఎస్సీ, ఎస్టీలపై 1,877 కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 11 నెలల్లోనే 2,257 (20.24% పెరుగుదల) కేసులు నమోదయ్యాయి. ఈ బాధితుల్లో 18 ఏండ్ల లోపు వారు 1251 మంది ఉండగా.. 18 ఏండ్లు పైబడిన వారు 274 మంది ఉన్నారు.
ఈ ఏడాది 11 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,34,158 కేసులు నమోదయ్యాయి. ఈ సంఖ్య నిరుడు 2,13,121గా నమోదైంది. దీంతో మొత్తం కేసుల్లో క్రైమ్ రేట్ 9.87శాతం పెరిగినట్టు వెల్లడైంది. 2023లో 39,371 కేసుల్లో శిక్షలు పడగా, ఈ ఏడాది కేవలం 28,477 కేసుల్లో మాత్రమే (-27.67శాతం) శిక్షల రేటు నమోదైంది. వీటిలో 3 మరణ శిక్షలు ఉన్నాయి. 18 జీవిత ఖైదు, మూడేండ్ల నుంచి ఏడేండ్లకు పైగా శిక్షలు 3, ఏడాది నుంచి 3 ఏండ్లకు విధించిన శిక్షలు 11 ఉన్నాయి. ఇక 3 రేప్ కేసుల్లో నలుగురికి జీవిత ఖైదు, మరో 5 కేసుల్లో ఐదుగురికి 20 ఏండ్ల జైలు విధించారు. మహిళల పట్ల నేరాలకు పాల్పడిన 51 కేసుల్లో 70 మందికి జీవిత ఖైదు విధించారు. ఇక 77 పోక్సో కేసుల్లో, 82 మందికి జీవిత ఖైదు విధించారు.
ఒకటి రెండు ఘటనలు మినహా రాష్ట్రం ప్రశాంతంగా ఉందని వార్షిక క్రైమ్ నివేదిక విడుదల సందర్భంగా డీజీపీ జితేందర్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తంగా నేరాల సంఖ్య 9.87 శాతం పెరిగిందని అంగీకరించారు. సైబర్ నేరాలు 43.44 శాతం పెరిగాయని, డ్రగ్స్‌పై ఉకుపాదం మోపుతున్నామని చెప్పా రు. గంజాయి 20 టన్నులు సీజ్ చేశామని, పెద్ద మొత్తంలో సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ ఏడాది 215 మందికి జీవిత ఖైదు పడిందని, 3 కేసుల్లో దోషులకు ఉరిశిక్ష పడిందని చెప్పారు. 23,491 రోడ్డు ప్రమాదాలు నమోదు కాగా 6,640 మంది మృతిచెందినట్టు తెలిపారు. మహిళలపై దాడులు, వేధింపులు 4.78 శాతం పెరిగాయని పేర్కొన్నారు. నిబంధనలు పాటించని ప్రైవేటు ఏజెన్సీలు, బౌన్సర్లపై చర్య లు తీసుకుంటామని వెల్లడించారు. సోషల్ మీడియాపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశామని, సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పేరుతో సోషల్ మీడియా ప్రచారాలపై దర్యా ప్తు చేస్తామని చెప్పారు. ఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులు తమ కిందిస్థాయి సిబ్బంది ప్రవర్తనపై నిఘా పెట్టాలని, ఎవరైనా స్టేషన్‌కు వచ్చే మహిళలను ట్రాప్ చేస్తే ఉపేక్షించేది లేదని, శాఖాపరమైన చర్యలు తీసుకునేందుకు వెనుకాడవద్దని తెలిపారు. డీజీలు శివధర్‌రెడ్డి, శిఖాగోయల్, అభిలాష బిస్త్, ఏడీజీలు మహేశ్ భగవత్, సంజయ్‌కుమార్ జైన్, విక్రమ్‌సింగ్ మాన్, ఐజీలు సత్యనారాయణ, సుధీర్‌బాబు, సుమతి, రమేశ్‌నాయుడు, చంద్రశేఖర్‌రెడ్డి, రమేశ్, ఐపీఎస్ వినీత్ పాల్గొన్నారు.
డయల్ 100కు ఈ ఏడాది 16,92,173 కాల్స్ వచ్చాయి. అయితే నిరుడు డయల్ 100 రెస్పాన్స్ టైమ్ 7 నిమిషాలకు చేరుకోగా.. 2022లో ఆ టైమ్ 5-6 నిమిషాలు ఉన్నది. ప్రస్తుతం డయల్ 100 రెస్పాన్స్ టైమ్ 15 నిమిషాలకు చేరినట్టు బాధితులు చెప్తుండగా.. వార్షిక నివేదికలో ఆ వివరాలను నమోదు చేయలేదు.