హైదరాబాద్/ఖైరతాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ) : బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసే వ్యక్తులపై కేసులు నమోదు చేయాలని ‘నమస్తే తెలంగాణ’ కథనం ద్వారా సందేశమిచ్చిన సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ పిలుపు మేరకు సామాజిక బాధ్యత కలిగిన ఓ యువకుడి ఫిర్యాదుతో పోలీసు యంత్రాంగం కదిలింది. బెట్టింగ్ యాప్స్‌తో యువతను తప్పుదారి పట్టించిన 11 మంది ఇన్ఫ్లూయెన్సర్లపై కేసు నమోదు చేసింది. వివరాల్లోకి వెళ్తే.. బెట్టింగ్‌యాప్స్‌కు బలి పశువులను చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్ల ఆగడాలపై ఈ నెల 16న నమ స్తే తెలంగాణలో ‘డబ్బు కోసం అడ్డదారు లు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచనతో బాధితులు బయటికి వచ్చి వారిపై ఫిర్యాదు చేయాలని ‘నమస్తే తెలంగాణ’ కోరింది. దీంతో ఓ యువకుడు ఇచ్చిన ఫిర్యాదుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది ఇన్ఫ్లూయెన్సర్లపై కేసు నమోదైంది. ఇమ్రాన్‌ఖాన్, విష్ణుప్రియ, హర్షసాయి, శ్యామల, టేస్టీ తేజ, రీతూ చౌదరి, బండారు శేషాయిని సుప్రిత, కిరణ్‌గౌడ్ తదితరులపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.