హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల పాలిట గుదిబండగా మారిన జీవో-28ని రద్దుచేయాలని సీపీఎస్ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ డిమాండ్ చేశారు. సీపీఎస్ స్థానంలో పాత పింఛన్‌ను పునరుద్ధరించాలని కోరారు. శనివారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో సీపీఎస్ఈయూ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జీవో-28 ప్రతులను దగ్ధం చేసి, నల్ల చొక్కాలు ధరించి, నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
బొగ్గులకుంటలోని సీపీఎస్ నోడల్ ఆఫీస్ ఎదుట జరిగిన కార్యక్రమంలో స్థితప్రజ్ఞ మాట్లాడుతూ.. జీవో-28 ద్వారా రెండు లక్షల మంది ఉద్యోగులను సీపీఎస్ విధానంలోకి నెట్టారని మండిపడ్డారు.. సీపీఎస్‌ను రద్దుచేస్తే ప్రభుత్వంపై ఎలాంటి ఆర్థిక భారం ఉండదని తేల్చిచెప్పారు. కేంద్రం పీఎఫ్ఆర్డీఏ ఆధీనంలోని రూ. 4.6లక్షల కోట్లను స్టాక్ మార్కెట్లోకి మళ్లించడం తప్ప ఉద్యోగుల సామాజిక భద్రత గురించి ఆలోచించలేదని ఆరోపించారు. ఉద్యోగులకు చెందిన రూ. 17వేల కోట్లు ఎన్పీఎస్ ట్రస్టు వద్ద ఉన్నాయని తెలిపారు. కాంగ్రెస్ హామీ ఇచ్చినట్టు సీపీఎస్‌ను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.