హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ): బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా వామపక్ష, ప్రజాతంత్ర శక్తులను ఏకం చేసేందుకు తెలంగాణ సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను సంపూర్ణంగా సమర్థిస్తున్నామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. స్వరాష్ట్రం వచ్చాక కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం సఖ్యతతో ఉన్నారని, ఆ సమయంలో బీజేపీ తప్పులను పెద్దగా పట్టించుకోలేదన్న తమ్మినేని.. ఇప్పుడు కేసీఆర్ సరైన వైఖరితో బీజేపీ మతోన్మాద, అప్రజాస్వామిక విధానాలను సునిశితంగా విమర్శిస్తున్నారని ప్రశంసించారు. అన్ని శక్తులను ఏకం చేసి తెలంగాణ ఉద్యమానికి ఎలాగైతే నాయకత్వం వహించారో.. బీజేపీ మతతత్వ వ్యతిరేక ఉద్యమానికి అలాగే నాయకత్వం వహించాలని కోరుకుంటున్నామని ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇవీ ఇంటర్వ్యూ వివరాలు..
తెలంగాణలో మతోన్మాదం చాలా వేగంగా పెరిగే అవకాశం ఉన్నది. అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవు. భౌతిక పరిస్థితులు.. ముఖ్యంగా ముస్లిం జనాభా తెలంగాణలో ఎక్కువ. అది బీజేపీకి పెద్ద వనరుగా మారింది. బీజేపీ హిందూ మతతత్వం రెచ్చగొట్టినప్పుడల్లా.. ముస్లిం మతతత్వం కూడా రెచ్చగొట్టబడుతున్నది. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ దుర్మార్గమైన స్టేట్మెంట్ ఇస్తారు. ఫండమెంటలిజం పెరుగుతుంది. దెబ్బతింటామనే భావనతో ముస్లింలు రెచ్చిపోతారు. సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో బీజేపీ విజయాల వెనుక ఉన్నది ఇలాంటి చరిత్రే.
రాజాసింగ్‌తో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయించేది బీజేపీ అధినాయకత్వమే. పైకి తప్పని వాళ్లే అంటారు.. సస్పెండ్ చేస్తారు. ఇవన్నీ మూణ్ణాళ్ల ముచ్చటే. వాళ్లు అనుకున్న ప్లాన్ అమలు జరుగుతుందా? లేదా? అనేది చూడా లి. మతోన్మాద భావం ప్రజల్లోకి పోతూనే ఉన్నది. క్షేత్రస్థాయిలో ప్రజల్లో ఉద్రేకాలు పెరుగుతూనే ఉన్నాయి. అదే వాళ్లకు కావాలి.
ఇప్పుడు ప్రభుత్వాలను కూలకొట్టడంలో ఓ కొత్త ైస్టెల్ వచ్చింది. గతంలో డబ్బు, పదవి ప్రధాన ఆయుధాలుగా ఉండేవి. ఇప్పుడు ఈడీ, సీబీఐ రూపంలో బీజేపీ చేతుల్లోకి కొత్త ఆయుధం వచ్చింది. ‘నువ్వు ఆ పార్టీలో ఉంటే జైలుకు పంపిస్తాం, మా పార్టీలోకి వస్తే పదవులు వస్తాయి’ అని బెదిరిస్తున్నారు. దీంతో జైలుకు పోవడం ఇష్టం లేక లొంగిపోతున్నారు. ప్రభుత్వాలను కూలదోసిన రాష్ర్టాల్లో జరిగింది ఇదే. కానీ అది తెలంగాణలో సాధ్యం కాదు.
ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న కేంద్ర హోం మంత్రి ఇలా వ్యాఖ్యానించడం సిగ్గుచేటు. ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే, 110 దాకా ఎమ్మెల్యేలు ఉన్న కేసీఆర్ గవర్నమెంట్‌ను ఎలా పడగొడతారు? ఆయన వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏంటంటే.. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మిగిలిన వాళ్లకు బీజేపీ బలపడుతున్నదనే సంకేతం వెళ్తుంది. ఆ వాతావరణం చూపించి, బ్లాక్మెయిల్ చేసి, ప్రభుత్వాన్ని పడగొడతారు. కానీ ఆయన ఎంత బ్లాక్ మెయిల్ చేసినా మెజార్టీని మార్చడం తెలంగాణలో సాధ్యం కాదు.
మునుగోడులో టీఆర్ఎస్ గెలిచే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ బీజేపీ రెండోస్థానంలో నిలిచినా తెలంగాణకు ప్రమాదమే. ఎందుకంటే కాంగ్రెస్ శ్రేణులకు దీంతో ఒక సంకేతం పోతది. భవిష్యత్తులో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కాదు.. టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేది క్రియేట్ అవుతుంది.
రాజగోపాల్‌రెడ్డి చెప్పినట్టు నియోజకవర్గ అభివృద్ధి జరగలేదన్నది సాకు మాత్రమే. నియోజకవర్గం అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్‌కు రాజీనామా ఎందుకు? ఇది రాజగోపాల్‌రెడ్డి ప్లాన్ కాదు. అలాగని బండి సంజయ్ ప్లాన్ కూడా కాదు. అమిత్‌షా, మోదీల ప్లాన్. ఇందులో తెలంగాణను కాషాయమయం చేయాలనే లోతైన కుట్ర ఉన్నది. కానీ తెలంగాణలో అది జరగదు.
మునుగోడులో ప్రతి ఊరికీ వెళ్తాం. గ్రామస్థాయిలో టీఆర్ఎస్, సీపీఎం శ్రేణులు కలిసి ప్రచారం చేస్తాయి. కొన్ని సభలు, సిద్ధాంత ప్రచారాలు మాత్రం మా పార్టీ ఆధ్వర్యంలో విడిగా నిర్వహిస్తాం. ఈ నెల 7న నియోజకవర్గంలో 2000 మంది సీపీఎం సభ్యులతో సమావేశం నిర్వహిస్తున్నాం. ఎన్నికలు డిక్లేర్ అయ్యాక భారీ బహిరంగ సభ లేదా మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహిస్తాం.
కేంద్ర ప్రభుత్వం సృష్టిస్తున్న సమస్యలపై స్పష్టమైన ఆధారాలతో ఫైట్ చేయాలి. అది కేసీఆర్ ఇప్పటికే చేస్తున్నారు. కానీ ఒంటరిగా చేస్తున్నారు. కలిసి వచ్చే వాళ్లందరితో ముందుకు పోవాలి. బీజేపీ వైఫల్యాలు చాలా ఉన్నాయి. వీటన్నింటిపై కేసీఆర్ నాయకత్వంలో ఒక పెద్ద సెమినార్ పెట్టి, మేధావులు, అన్ని రాజకీయపార్టీలను పిలిచి మాట్లాడితే బీజేపీ మీద ఫైట్‌కు అది పెద్ద ఆయుధంగా మారుతుంది. అందరినీ ఒక వేదికపైకి తీసుకువచ్చి తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినట్లే.. బీజేపీ మతతత్వ వ్యతిరేక ఉద్యమానికి నాయకత్వం కూడా ఆయనే వహించాలి.
అవన్నీ బాధ్యతారహితమైన ప్రచారాలు. ఎటుచేసీ విద్వేషాలు రెచ్చగొట్టడమే వాళ్లపని. అందుకోసం ఎంతకైనా దిగజారుతారు. ఎవరినైనా తిడతారు. మతపిచ్చి గాళ్లు అంతకుమించి చేసేది ఏమీలేదు. అవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదనేది నా అభిప్రాయం. వాస్తవంగా కొన్ని వర్గాల్లో మత భావజాలాన్ని ఎక్కించడంలో బీజేపీ సఫలం అవుతున్నది. ఆ ప్రమాదాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. బీజేపీని ఎదుర్కొనేందుకు రాజకీయ యుద్ధానికే పరిమితం కాకుండా సాంస్కృతిక యుద్ధం చేయాలి. ఇందుకోసం మేధావులు, కలిసివచ్చే రాజకీయ శక్తులను కలుపుకొని కేసీఆర్ ముందుకు పోవాలి. అప్పుడే ఆయన చేసే పోరాటానికి ఒక బలం వస్తుంది.
ఎనిమిదేండ్లుగా కేంద్రంలోని బీజేపీ పాలన దేశాన్ని వినాశనం వైపు తీసుకెళ్తున్నది. ఎన్నికల సమయంలో బ్లాక్ మనీ తెస్తామని, కోటి ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేదు. అది పక్కన పెడితే ఉన్న దేశాన్ని పూర్తిగా నాశనం చేశారు. ముఖ్యంగా లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సారభౌమత్వం, ఫెడరల్ స్ఫూర్తి, సామాజిక న్యాయం అనే రాజ్యాంగ మూల విలువలను నాశనం చేశారు. ప్రభుత్వం, రాజకీయాలు మతానికి సంబంధం లేకుండా ఉండాలి. కానీ 8 ఏండ్లలో మతాన్ని రాజకీయాల్లోకి, పరిపాలనలోకి, చివరకు పాఠ్యాంశాల్లోకి తీసుకురావడం చూశాం. బండి సంజయ్ యాత్రకు హిందూ ఏక్తా యాత్ర అని పేరు పెట్టారు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఒక మతాన్ని ఏకం చేసే యాత్ర చేయడం ఏంటి? దేశాన్ని ఆర్థికంగా పూర్తిగా నాశనం చేశారు. కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలు బొమ్మగా మారారు. రాష్ర్టాలకు ఉండే హక్కులు, అధికారులను కాలరాస్తున్నారు.
మాకు కావాల్సిందల్లా బీజేపీని ఓడించడం. దానికి కాంగ్రెస్ సరైందని అనుకోవడం లేదు. రోజురోజుకు వాళ్లు బలహీన పడుతున్నారు. ఆలిండియా స్థాయిలోనూ కాంగ్రెస్‌తో సీపీఎం ఐక్య సంఘటన, మితృత్వం ఎప్పుడూ పెట్టుకోలేదు. కేరళలో బీజేపీతో కలిసి కాంగ్రెస్ వాళ్లు సీఎం విజయన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. దేశ స్థాయిలో కాంగ్రెస్ తప్ప బీజేపీకి ప్రత్యామ్నాయం ఇప్పటికైతే లేదు. కానీ ఆ పార్టీకి ఆ సోయి లేదు. మతోన్మాదాన్ని బీజేపీ అంత తీవ్రంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి కాంగ్రెస్‌కు బలమైన సిద్ధాంతం ఉండాలి.. కానీ లేదు. సెక్యులర్ భావాన్ని బలంగా ముందుకు తీసుకురావడంలో కాంగ్రెస్ విఫలమైంది.
తెలంగాణలో పథకాలతో లబ్ధిపొందిన వాళ్లు కచ్చితంగా ఎన్నికలను ప్రభావితం చేస్తారు. దీంతో టీఆర్ఎస్కు మేలు జరిగి తీరుతుంది. ఈ మధ్యే 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు ఇస్తున్నారని తెలిసింది. అలా పెండింగ్ పనులన్నింటినీ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పోడుభూముల సమస్య, వీఏవోలు, ఆర్టీసీ ఉద్యోగులు, అసంఘటిత రంగ కార్మికుల సమస్యలు, షెడ్యూల్ పరిశ్రమల్లో కనీస వేతన నిర్ణయం, జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు మొదలైన విషయాలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. క్యాబినెట్ సమావేశంలో వీటిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోరతాం.