Tammineni Veerabhadram | కొడంగల్, డిసెంబర్ 30: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మితే మొదటికే మోసం వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏటా రూ.15 వేలు వస్తాయని రైతులు అనుకున్నారని.. కానీ, అసలుకే ఎసరు వచ్చిందని చెప్పారు. కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలోని హకీంపేటలో సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం రైతాంగ సభ జరిగింది. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. గత ప్రభుత్వం అందించిన రూ.10 వేలు కూడా ప్రస్తుతం రైతులకు అందడం లేదని, అనుకున్నది ఒక్కటి.. అయ్యింది ఒక్కటి అన్నట్టు పరిస్థితి తయారైందని, రైతులు ఆందోళనకు గురవుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాల భర్తీతో పాటు 420 హామీలను రేవంత్‌రెడ్డి ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పటివరకు ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని, ఎన్ని హామీలను నెరవేర్చిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో మహిళలకు ఉచిత బస్సు మాత్రేమే కనిపిస్తున్నదని చెప్పారు. అది కూడా బస్సులు లేక, ఉన్నా సీట్లు లేక కొట్లాటల పర్వం కొనసాగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ముందు ఒక మాట.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోమాట మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
పేదల భూములకు లీగల్ సమస్యలు రావా?
‘లగచర్లలో దొరల భూములు తీసుకోవడానికి లీగల్ చిక్కులు వస్తే.. లంబాడి రైతుల భూములు లాక్కోవడానికి మాత్రం చిక్కులు రావా?’ అని తమ్మినేని వీరభద్రం కాంగ్రెస్ సర్కార్‌ను ప్రశ్నించారు. లంబాడి రైతుల భూములను రక్షించేందుకు ఎర్రజెండా వస్తుందని భరోసా ఇచ్చారు. పెత్తందారుల భూములకు లీగల్ చిక్కులు వస్తాయని సీఎం రేవంత్ ప్రస్తావించడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. కొడంగల్‌లో 1,156 ఎకరాల సీలింగ్ భూమి ఉందని, గతంలో కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రేవంత్ కూడా దానిపై పోరాడారని గుర్తుచేశారు. అలాంటి భూముల్లో అభివృద్ధి పనులు చేపట్టాలి కానీ, పచ్చటి పంటపొలాల్లో కంపెనీలు ఏర్పాటు చేయడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొడంగల్‌లోని 1,156 ఎకరాల సీలింగ్ భూముల్లో లీగల్ సమస్య తలెత్తుతుందని పేర్కొనడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పంటలు పండే భూములను తీసుకునే హక్కు ప్రభుత్వానికి లేదని ఉద్ఘాటించారు.
బీడు భూములు, తొండలు కూడా గుడ్లు పెట్టని భూములను తీసుకొని అభివృద్ధి పనులు చేస్తున్నామని రేవంత్ ప్రచారం చేస్తున్నారని.. కానీ, ఆ భూములన్నీ పచ్చని పంటలు పండేవేనని స్పష్టం చేశారు. లగచర్లలో గతంలో సీపీఐ పర్యటించినప్పుడు ఈ ప్రాంతం పూర్తిగా పచ్చదనంతో నిండి ఉందని, నాడు చిత్రీకరించిన వీడియోలను సీఎంకు చూపించినట్టు తెలిపారు. రైతులకు సీపీఐ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. అయితే, కలిసి పోరాడినప్పుడే భూములను కాపాడుకునే అవకాశం ఉంటుందని రైతులకు సూచించారు. రైతులపై పెట్టిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని, వెంటనే రైతులందరినీ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జాన్‌వెస్లీ, డీజీ హన్మంతరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్.వెంకట్రాములు, జిల్లా కార్యదర్శి మహిపాల్, జిల్లా కార్యవర్గ సభ్యులు వెంకటయ్య, సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు బుస్స చంద్రయ్యతో పాటు రామకృష్ణ, శ్రీనివాస్, బుగ్గప్ప, సుదర్శన్, సతీష్, నర్సమ్మ, నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.