వనపర్తి, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ స్పష్టంచేశారు. వనపర్తిలో నిర్వహించిన సీపీఎం జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రమాదంలో చిక్కుకున్న వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సరైన పరిశీలన, పర్యవేక్షణ లేకుండా పనులు చేపట్టడం ఈ ప్రమాదానికి కారణంగా కనిపిస్తున్నదని తెలిపారు. ఘటన అనంతరం తీసుకున్న చర్యలన్నీ నామమాత్రంగానే ఉన్నాయని మండిపడ్డారు. ప్రమాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.