హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలుకోసం కేంద్రం పార్లమెంటులో చట్టం చేసి 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ నిరసనలు చేపట్టాలని సీపీఎం రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. బుధవారం హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో ఎస్ వీరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో.. రాజకీయ నిర్ణయాలను రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ వెల్లడించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు కోసం సీపీఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 8న మండలాలు, జిల్లా కేంద్రాలు, 9,10 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిపారు.
అగమ్యగోచరంగా బీసీ రిజర్వేషన్లు ; బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ఆమోదం తేలకపోవడం, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో బీసీల రిజర్వేషన్ల అంశం అగమ్యగోచరంగా మారిందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ బిల్లు ఆమోదించి గవర్నర్, రాష్ట్రపతికి పంపిందని గుర్తుచేశారు. 3 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషన్ను, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు.