Kodangal Lift | నారాయణపేట : నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం సేకరిస్తున్న భూసేకరణను చట్టబద్ధంగా సేకరించాలని, రైతులకు నోటీసులు అందించి గ్రామ సభలను నిర్వహించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామిరెడ్డి, సభ్యులు బాల్రాం డిమాండ్ చేశారు.
గురువారం రోజు ఊట్కూరు మండల పరిధిలోని బాపూరు, తిప్రాస్పల్లి గ్రామ రైతులతో సీపీఎం నేతలు మాట్లాడారు. వ్యవసాయ పొలాల్లో అధికారులు దౌర్జన్యంగా పెట్టిన హద్దులను పరిశీలించారు. పంప్ హౌస్, సబ్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ఒకే దగ్గర 126 ఎకరాల సారవంతమైన వ్యవసాయ భూమిని సన్న చిన్నకారు రైతుల నుండి అధికారు బలవంతంగా సేకరించేందుకు సర్వే చేసి హద్దులు పెట్టడం దారుణమని విమర్శించారు. పక్కనే ఉన్న 30 ఎకరాలకు పైగా ఉన్న పెద్దోళ్ల భూముల జోలికి ప్రభుత్వం పోవడం లేదని మండిపడ్డారు.
2013 భూ సేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం చట్టబద్ధంగా భూసేకరణ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో భూ బాధితుల పక్షాన నిలబడి సీపీఎం పార్టీ పోరాటం చేస్తుందని హెచ్చరించారు. సీపీఎం బృందం పర్యటన చేస్తున్న సమయంలో సీపీఎం నాయకులు శంకర్ భాపూర్, తిప్రాస్పల్లి గ్రామాలకు చెందిన భూ బాధితులు వడ్ల వెంకటయ్య, బుగ్గప్ప, హన్మంత్, నర్సిములు వెంకటరెడ్డి, పద్మమ్మ తదితరులు ఉన్నారు.