హైదరాబాద్, మే 14 (నమస్తే తెలంగాణ) : భారత్- పాక్ కాల్పుల విరమణపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా ప్రకటన చేయడంపై సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఇరుదేశాల మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వం అనవసరమని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన బేబీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బేబీ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్రప్రభుత్వం తక్షణమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి, వివరాలను దేశప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
పహల్గాంలో ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు చనిపోవడంపై ఆవేదన వ్యక్తంచేశారు. ఉగ్రవాదాన్ని అణచివేయాలని, పాకిస్థాన్‌పై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరముందని చెప్పారు. యుద్ధం ముగిసిందని మోదీ చెప్తుంటే, పాక్ మాత్రం కశ్మీర్లో కాల్పులు జరుపుతూనే ఉందని గుర్తుచేశారు. జూన్ 3న ఢిల్లీ వేదికగా సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు జరుగుతాయని, కేరళలో మళ్లీ ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తుందని చెప్పారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయడం శుభపరిణామమని బీవీ రాఘవులు అన్నారు. శంషాబాద్‌లోని కరాచీ బేకరీ మీద దాడికి పాల్పడిన వారిపై కఠినచర్యలు తీసుకోవాలని జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు.