హైదరాబాద్, ఆగస్టు 31, (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీపీ ఎం డిమాండ్ చేసింది. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులకు నిధులు విడుదల చేసి పూర్తి చే యాలని డిమాండ్ చేస్తూ సోమవారం బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరాపారు వరకు పాదయాత్ర చేపట్టింది. అనంతరం వేలాది మందితో నిర్వహించిన మహాధర్నాలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ రూ.1700 కోట్లు ఖర్చుపెడితే ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చునని సూచించారు. డిండి, చర్లగూడెం ప్రాజెక్టులను పెండింగ్లో పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
రాచకొండ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేసి వదిలిపెట్టారని, కనీసం డీపీఆర్ కూడా రూపొందించడం లేదని తెలిపారు. యాప్ తెచ్చి రైతులకు సకాలంలో యూరియా దకకుండా చేయడం దుర్మార్గమని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్ వీరయ్య ధ్వజమెత్తారు. చిన్న, మధ్యతరహా ప్రాజెక్టులను పూర్తిచేయాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ యాద్రాది జిల్లాలో తిరిగితే రైతులు, ప్రజ ల సమస్యలు తెలుస్తాయని మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములు సూచించారు.