May Day | ఖమ్మం/ కొత్తగూడెం అర్బన్, మే 1: మేడే స్ఫూర్తితో కార్మికులు ఐక్యంగా ఉద్యమించాలని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు తమ్మినేని వీరభద్రం, కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. దేశ ఐక్యతకు విఘాతం కలిగించే మతోన్మాద, కార్మిక వర్గ వ్యతిరేక మోదీ ప్రభుత్వాన్ని వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో గద్దె దింపాలని పిలుపునిచ్చారు. అలా జరిగితేనే కార్మికుల హకులను, దేశాన్ని కాపాడుకోగలమని అన్నారు.
సోమవారం సీపీఎం, దాని అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఖమ్మంలో జరిగిన మేడే వేడుకల్లో తమ్మినేని వీరభద్రం, సీపీఐ, దాని అనుబంధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కొత్తగూడెంలో జరిగిన మేడే వేడుకల్లో కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. కొత్త హకుల కోసం కొట్లాడాల్సింది పోయి ఈ బీజేపీ ప్రభుత్వంలో ఉన్న హకులను పరిరక్షించుకోవడం కోసం కార్మిక వర్గం కొట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు.
ఎనిమిది గంటల పని దినం కోసం మరో చికాగో పోరాటాన్ని మన దేశంలో నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని తమ్మినేని, కూనంనేని పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతులను సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో నొక్కుతోందని ఆరోపించారు. సమ్మె చేసే హక్కు కూడా కేంద్రం హరించిందని దుయ్యబట్టారు. కార్మికుల శక్తిని కార్పొరేట్లకు, యాజమాన్యాలకు దోచిపెట్టే కుట్రలకు పాల్పడుతోందని విమర్శించారు.