బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు అన్ని పార్టీలు ఏకం కావాలి: చాడ
హైదరాబాద్, ఫిబ్రవరి 18: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ఫ్రంట్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని మగ్ధూంభవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మతోన్మాదం, ఫాసిజాన్ని రెచ్చగొడుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాలని సూచించారు. ఏపీ, తెలంగాణ విషయంలో కేంద్రం ప్రేక్షకపాత్ర పోషిస్తున్నదని మండిపడ్డారు. జల వివాదాలు, విద్యుత్తు బకాయిల సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయని అన్నారు. వీటిని పరిష్కరించటంలో పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని అంశాలను పరిష్కరించాలని, ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించకుంటే కలిసివచ్చే రాజకీయ పార్టీలతో ప్రత్యక్ష ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.