హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ రాష్ట్రం భారత్‌లో విలీనమైన రోజు సెప్టెంబర్ 17కు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని..ఆ మహోన్నత పోరాటంలో వారి పాత్ర లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఆనాటి పోరాట స్ఫూర్తితోనే మలిదశ ఉద్యమంలో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నామని చెప్పారు.
తెలంగాణ సాయుధ పోరాటాలు భావితరాలకు తెలిసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. సాయుధ పోరాటం, చరిత్రను భవిష్యత్ తరాలకు అర్థమయ్యేలా విభిన్న కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కమ్యూనిస్టు యోధులు రావి నారాయణరెడ్డి, బద్దం ఎల్లారెడ్డి విగ్రహాలను ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. సాయుధ పోరాటంలో దాదాపు 4 వేల మంది అమరులయ్యారని, వారి పేర్లతో ఇండియాగేట్ మాదిరి స్మారక చిహ్నం, మ్యూజియం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.