హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఎర్ర చందనం స్మగ్లింగ్ లాంటి క్రూరమైన దొంగ వ్యాపారాన్ని గౌరవంగా చూపిస్తూ తీసిన సినిమాకు రాయితీలు ప్రకటించి, ప్రజలపై భారం మోపిన తెలంగాణ ప్రభుత్వం అసలైన ముద్దాయి అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఏదైనా సందేశాత్మక చిత్రానికి రాయితీలు ఇవ్వవచ్చు కానీ పుష్ప వంటి సినిమాకు ఇవ్వడమేంటని ఆదివారం విడుదల చేసిన ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనపై చౌకబారు ప్రచారానికి సినిమా వాళ్లు పాల్పడవచ్చేమో గానీ రాజకీయ నాయకులు కక్కుర్తి పడడమేంటని నిలదీశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే రాజకీయాలు చేయడం సరికాదని మండిపడ్డారు. ఈ ఘటనను ప్రగతిశీల కళాకారులు, సాహితీవేత్తలు, సామాజిక స్పృహ ఉన్న వారంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. బాధిత కుటుంబానికి పుష్ప టీం ఇచ్చే ఆర్థిక సాయాన్ని తిరస్కరించాలని, ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే తమ వంతు సాయం కూడా ప్రకటిస్తామని వెల్లడించారు.