పెద్దపల్లి: భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత దేశంలో ప్రధాని మోదీ.. కులచిచ్చు, మతచిచ్చు పెట్టి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్రెడ్డి (Chada Venkat reddy) ఆరోపించారు. బీజేపీ దాని అనుబంధ ఆర్ఎస్ఎస్, వీహెచ్పీ, ఏబీవీపీ, సంఘ్ పరివార్ల కనుసన్నల్లోనే దళితులు, ముస్లిం వర్గాలపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జరిగిన సీపీఐ మూడో వార్షిక మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మతతత్వ విద్వేశాలకు వ్యతిరేకంగానే మునుగోడులో టీఆర్ఎస్ పార్టీకి మద్దతిచ్చామని చెప్పారు.
బీజేపీ నాయకులు తమ స్వార్థ రాజకీయాలకోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. దేశంలో మత పిచ్చి, ఉన్మాదం పెరిగిపోయిందని.. దానికి వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పార్టీలన్నీ ఏకం కావలసిన ఆవశ్యకత ఏర్పడిందన్నారు. ప్రధాని మోదీ మతోన్మాదం, నియంతృత్వ, ఫాసిస్ట్ విధానాలను వ్యతిరేకించకపోతే దేశం అంధకారంగా మిగిలిపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దానిని మర్చిపోయారని విమర్శించారు. సంస్కరణల పేరుచెప్పి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు.
దేశంలో ఇప్పటికే ప్రతిపక్షలు పాలనలో ఉన్న తొమ్మిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టి బీజేపీ ప్రభుత్వాలను అధికారంలోకి తీసుకువస్తున్నాడని విమర్శించారు. భారతదేశ చరిత్రలో ఇంతగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన వ్యక్తి మోదీ తప్ప ఇంకెవరూ లేరని విమర్శించారు. రాష్ట్రంలో సైతం సీఎం కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రధాని కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు.