హైదరాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ): అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల పేరిట ప్రభుత్వ ఖర్చుతో వచ్చి ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాజకీయాలు మాట్లాడుతున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ విమర్శించారు. హడావుడిగా పాత అభివృద్ధి పనులను మోదీ ప్రారంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం హైదరాబాద్‌లోని మగ్దూంభవన్‌లో సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, పశ్య పద్మలతో కలిసి మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడారు. బీజేపీ అంతిమ దశలో ఉందని, పసుపుబోర్డు ప్రకటన చనిపోయే ముందు తులసీ తీర్థం పోసినట్టు ఉందని ఎద్దేవా చేశారు. మళ్లీ మోదీ అధికారంలోకి వస్తే దేశం ఉత్తరభారత్, దక్షిణ భారత్‌గా విడిపోయే ప్రమాదం ఉందని తెలిపారు.