ఖమ్మం కమాన్‌బజార్, జనవరి 18: కమ్యూనిస్టు పార్టీ పుట్టి నూరు వసంతాలు పూర్తిచేసుకున్నదని, మరో వందేండ్లు పేదల కోసం పోరాడేందుకు కూడా సిద్ధమని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా పేర్కొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శత వసంతాల ముగింపు సభను ఆదివారం ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన డీ రాజా మాట్లాడుతూ.. చరిత్రలేని వారు దేశభక్తులుగా చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారని బీజేపీని ఉద్దేశించి విమర్శించారు.
దేశంలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పాటు అత్యంత కీలకఘట్టమని, కాంగ్రెస్ పార్టీ కంటే ముందే సీపీఐ స్వాతంత్య్రానికి పిలుపునిచ్చిందని చెప్పారు. వందేండ్లు త్యాగాలతోనే గడిచిపోయిందని, అనేకమంది తమ త్యాగాలతో ఈ నేలను పునీతం చేశారని వివరించారు. వందేండ్ల చరిత్ర అని చెప్పుకుంటున్న ఆరెస్సెస్ పాత్ర స్వాతంత్రోద్యమంలో ఏమిటని ప్రశ్నించారు. దేశంలో మతోన్మాద శక్తులు చెలరేగుతున్నాయని, బలమైన ఉద్యమాలతో ఆ శక్తులను అడ్డుకుంటామని చెప్పారు.
భారత్‌పై అమెరికా ఒత్తిడి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంతగా వ్యవహరిస్తున్నారని డీ రాజా విమర్శించారు. ట్రంప్‌ను ఎర్రజెండాలు ఎదుర్కొంటాయని తెలిపారు. మెక్సికో, కొలంబియా, క్యూబా వంటి దేశాలను అమెరికా బెదిరిస్తున్నదని మండిపడ్డారు. భారత్.. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నదని, దీనిని నిలిపివేయాలని అమెరికా ఒత్తిడి తేవడం శోచనీయమని పేర్కొన్నారు. ఐక్కరాజ్యసమితి మద్దతు ఉన్న ద్విరాష్ట్ర పరిష్కారానికి సీపీఐ కట్టుబడి ఉన్నదని తెలిపారు. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి వాకాటి శ్రీహరి, సీపీఐ నేతలు అమర్జిత్కౌర్, గిరిశర్మ, పల్లా వెంకటరెడ్డి, పువ్వాడ నాగేశ్వరరావు, బినయ్‌విశ్వం, రామకృష్ణ, నారాయణ, హేమంతరావు, మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి, వందేమాతరం శ్రీనివాస్, వేం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
కదం తొక్కిన కమ్యూనిస్టులు
భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ఖమ్మం ఎరుపెక్కింది. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి తదితర రాష్ర్టాల నుంచి కార్యకర్తలు సభకు తరలివచ్చారు. నగరంలోని ప్రధాన రహదారులన్నీ జనసంద్రంగా మారాయి.
పేదల కోసం పోరాడేది కమ్యూనిస్టులే: సీఎం రేవంత్‌రెడ్డి
పేదల హక్కుల కోసం పోరాడేది కమ్యూనిస్టులేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. ఆ పోరాటాల్లో ప్రాణాలు విడిచినా ఎర్రజెండాను వదలబోమని ప్రకటించిన కామ్రేడ్లకు వందనాలని పేర్కొన్నారు. ‘దున్నే వాడిదే భూమి’ అని కమ్యూనిస్టులు పిలుపునిస్తే, దానిని అమల్లోకి తెచ్చినవారు ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, బూర్గుల రామకృష్ణరావు అని గుర్తుచేశారు. ఖమ్మంలో ఆదివారం జరిగిన సీపీఐ శతాబ్ది ఉత్సావాల సభలో సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని చెరబట్టడానికి ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి కూలీల కోసం ఉపాధి హామీ పథకం తీసుకొస్తే, బీజేపీ ప్రభుత్వం దానిని రద్దు చేసిందని మండిపడ్డారు. రాజ్యాంగ సభ సమయంలోనూ గోల్వాల్కర్ వారసులు పేదలకు ఓటుహక్కు లేకుండా చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. అడవుల్లో పుట్టి పెరిగిన గిరిజనులు ఎక్కడినుంచి ఆధారాలు తీసుకొస్తారని ప్రశ్నించారు.