MLA Kunamneni | హైదరాబాద్ : మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననం తప్ప మరొకటి కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు జంగిల్ రాజ్ పరిపాలనకు పరాకాష్ట అని వారన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో పావులుగా మారారని ఆయన పేర్కొన్నారు.
ఈ రోజు మాడేరుమిల్లిలో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్, అంతకంటే ముందు మావోయిస్టులపై జరిగిన ఎన్కౌంటర్స్ మొత్తం ఫేక్ ఎన్కౌంటర్స్ అని కూనంనేని పేర్కొన్నారు. బూటకపు ఎన్కౌంటర్లతో మనుషులను చంపుకునే వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేదని, మావోయిస్టులు ఏదైన నేరాలు చేసివుంటే వారిని అరెస్టు చేసి చట్టభద్దంగా విచారణ జరిపించాలని ఇలాంటి ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం విచారకరమని అన్నారు. మావోయిస్టులపై జరుగుతున్న ఎన్కౌంటర్లపై విచారణ జరిపించాలని కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు.