Bade Chokka Rao | కొత్తగూడెం ప్రగతి మైదాన్/ములుగు, జనవరి 18: మావోయిస్టు కీలక నేత, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి దామోదర్ (దాదా) అలియాస్ బడే చొక్కారావు (46) ప్రస్తానం ముగిసింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా ఊసూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని జుజారి కాంకేర్ శివారులో ఈ నెల 16న జరిగిన భారీ ఎన్కౌంటర్లో చొక్కారావు నేలకొరిగినట్టు మావోయిస్టు పార్టీ సౌత్ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి గంగ శనివారం విడుదల చేసిన లేఖలో పేర్కొన్నారు. ఎన్కౌంటర్లో 18 మంది చనిపోయినట్టు ఆ లేఖలో పేర్కొన్నారు. మృతితో బడే చొక్కారావు 27 ఏండ్ల అజ్ఞాత జీవితానికి తెరపడింది. ఎన్కౌంటర్లో దామోదర్ మృతి చెందాడన్న విషయం తెలిసి ములుగు జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
గతంలో జరిగిన పోలీస్ ఎదురుకాల్పుల్లో రెప్పపాటులో తప్పించుకున్న చొక్కారావు మరణవార్త విని తాడ్వాయి మండలం కాల్వపల్లి కంట తడి పెట్టింది. బడే ఎల్లయ్య, బతుకమ్మ సంతానమైన దామోదర్ కాల్వపల్లి ఊరట్టం పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు. తర్వాత 1997లో గోవిందరావుపేటలో ఇంటర్మీడియట్ చదివారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ విభాగంలో చురుగ్గా పనిచేసిన దామోదర్ అతడి తోడల్లుడు బడే మురళితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లాడు.
దళ సభ్యుడి నుంచి కార్యదర్శి దాకా ప్రస్థానం
బడే చొక్కారావు తొలుత దళ సభ్యుడిగా, ఎల్జీఎస్ కమాండర్‌గా, డిప్యూటీ కమాండర్‌గా, ఏటూరునాగారం ఏరియా కమిటీ కార్యదర్శిగా మావోయిస్టు పార్టీలో ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేయడంతోపాటు జిల్లా కమిటీ సభ్యుడిగా కూడా కొనసాగారు. ఖమ్మం, కరీంనగర్,వరంగల్ (కేకేడబ్ల్యూ) కార్యదర్శిగా, ఉత్తర తెలంగాణ డివిజన్ కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్ పేల్చిన ఘటనలో దామోదర్ ప్రధాన పాత్ర పోషించారు.
ఉద్యమ బాట పట్టి 27 ఏండ్లపాటు సుదీర్ఘంగా భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఆయుధం పట్టిన చొక్కారావు.. వెనుదిరిగి చూడలేదు. మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ 2021లో అనారోగ్యంతో మృతిచెందారు. ఆ తర్వాత చొక్కారావును తెలంగాణ ప్రాంతానికి ఇన్చార్జిగా కేంద్ర కమిటీ నియమించింది. చొక్కారావు పేరున ఛత్తీస్‌గఢ్‌లో రూ.50 లక్షలు, తెలంగాణలో రూ.25 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయి. చొక్కారావు మృతిచెందాడని మావోలు లేఖ విడుదల చేయగా, ఆయన మృతిని బస్తర్ ఐజీ ధృవీకరించలేదు.