హైదరాబాద్ : తెలంగాణ విమోచన పేరుతో బిజెపి హడావుడి చూస్తుంటే.. ఊళ్లో పెళ్లికి కుక్కల హడావుడిలా ఉన్నదని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆనాడు పోరాటం చేసింది కమ్యూనిస్టులైతే, ఇప్పుడు ఉత్సవాలు చేస్తున్నది ఆనాడు పోరాటంలో లేని బీజేపీ అన్నారు. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట 74వ వారోత్సవాల సందర్భంగా సీపీఐ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ భారీ బహిరంగ సభ జరిగింది.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన సభలో సురవరం సుధాకర్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీం, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ కే నారాయణ, కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, సయ్యద్ అజీజ్ పాషా , తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, తదితరులు ప్రసంగించారు. సభకు హైదరాబాద్ జిల్లా కార్యదర్శి ఈటీ నర్సింహా స్వాగతం పలకగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్ వందన సమర్పణ చేశారు.
సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు నిజాం సర్కార్, ఇతర భూస్వాములు చేస్తున్న దురాగతాలను చూసి భయపడి కలుగుల్లో ఎలుకల లాగా ఆర్ఎస్ఎస్ వారు దాక్కున్నారని విమర్శించారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ బీజేపీ నేడు ఆ పోరాట ఉత్సవాలు జరుపుకుంటోందని, ఎవరైనా ఉత్సవాలు జరుపుకోవచ్చు కానీ, వక్రీకరణలతో జరపొద్దన్నారు. తెలంగాణ పోరాటం కమ్యూనిస్టులు లేకుండా జరిగిందా? అని ప్రశ్నించారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వస్తే నిజాం నవాబు స్వాతంత్య్రం ప్రకటించకుండా భారతదేశంతో యథాతధ ఒడంబడికచేసుకోలేదా? దాన్ని నిజం నవాబు, సర్ధార్ వల్లభాయి పటేల్ చేయించలేదా? అని నిలదీశారు.
అలాంటి పటేల్ తెలంగాణను విముక్తి చేశాడా? అని అన్నారు. అప్పటికే మూడు వేల గ్రామాలను విముక్తి చేసిన కమ్యూనిస్టులు కొది నెలల్లో తెలంగాణ అంతా విముక్తి చేస్తారనే భయంతో భారత సైన్యాన్ని హైదరాబాద్ పటేల్ పంపారని అన్నారు. భారత సైన్యాలు రావాలనుకుంటే 1947లోనే ఎందుకు రాలేదని, రజాకార్ల అరాచకాలు చేసినప్పుడు ఏమి చేశారని అన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం విమోచన దినోత్సవమని నిర్వహిస్తున్నప్పుడు, జమ్మూ కశ్మీర్ త్రిపుర, సిక్కింల్లో విలీన దినోత్సవమని ఎందుకు నిర్వహిస్తున్నారని అన్నారు.
ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు సావర్కర్ వీరుడు అని అంటున్నారని, కర్నాటక పాఠ్య పుస్తకాలలో జైలు నుంచి సావర్కర్ పక్షి రెక్కల మీద వెళ్లి ప్రజలతో సంభాషించి తిరిగి వెళ్లేవాడని ఉందని సురవరం తెలిపారు. ఆ వీరుడు కనీసం రైలులోనైనా తెలంగాణకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. నిజాం వ్యతిరేక పోరాటానికి మద్దతుగా కనీసం పత్రికా ప్రకటనైనా ఎందుకు ఇవ్వలేదన్నారు. దేశాన్ని భ్రష్టు పట్టించిన మోదీ ఆర్థిక విధానాల నుండి ప్రజల దృష్టి మరలించేందుకు మతం పేరుతో ప్రజలను విభజించి మళ్లీ అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు.
అందులో భాగంగానే నైజాం వ్యతిరేక పోరాటాన్ని హిందూ, ముస్లిం యుద్ధంలాగా చిత్రీకరిస్తూ, అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మహత్తర పోరాటంలో కమ్యూనిస్టు పాత్రను బిజెపి తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. నాటి పోరాటంలో మహిళలు కీలక పాత్ర పోషించారని, ఆరుట్ల కమలాదేవి, మల్లు స్వరాజ్యం, చిట్యాల ఐలమ్మ, చంటి బిడ్డను అడవిలో వదిలేసిన కమలమ్మ , పశ్య కన్నమ్మ వంటి వీర యోధులు పోరాడారని చెప్పారు.