తెలంగాణ చౌక్/హైదరాబాద్, ఏప్రిల్ 16: వచ్చే సాధారణ ఎన్నికల్లో మతోన్మాద బీజేపీని ఓడించి దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని సీపీఐ రాష్ట కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 16 నుంచి 27 వరకు ప్రజా చైతన్యయాత్రను నిర్వహిస్తున్నారు. ఆదివారం కరీంనగర్ కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామితో కలిసి కూనంనేని పూలమాల వేసి యాత్రను ప్రారంభించారు. అక్కడి నుంచి మార్కెట్ రోడ్లో అనభేరి ప్రభాకర్ విగ్రహం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. కేవలం ఓట్ల కోసమే బీజేపీ రాముడి పేరును, హిందూత్వాన్ని వాడుకుంటున్నదని మండిపడ్డారు. సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కుట్రలు చేస్తూనే.. బయటకు మాత్రం అదేమీ లేదని కార్మికులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు.ఈ కార్యక్రమంలో చాడ వెంకటరెడ్డి, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల పార్టీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ అడ్డగుట్టలో ఆదివారం ఇంటింటికీ సీపీఐ కార్యక్రమాన్ని సీపీఐ జాతీయ కార్యదర్శి అజీజ్ పాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రశ్నించే ప్రతిపక్షాలపై కేంద్రం ప్రభుత్వం దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ భయాందోళనకు గురిచేస్తున్నదని విమర్శించారు. అచ్చేదిన్ అంటూ నిత్యావసరాల ధరలను విపరీతంగా పెంచి సామాన్యులు బతికే పరిస్థితి లేకుండా చేస్తున్నదని మండిపడ్డారు.