కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం
సీపీఐ నేత చాడ వెంకట్రెడ్డి
కరీంనగర్ తెలంగాణ చౌక్, మార్చి 16: కృష్ణా, గోదావరి నదీజలాల నిర్వహణ బోర్డులను ఏర్పాటుచేసి రాష్ట్ర హక్కులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హరిస్తున్నదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి మండిపడ్డారు. వెంటనే నదీజలాల బోర్డుల గెజిట్ నోటిఫికేషన్ను ఉపసహరించుకోవాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని సీపీఐ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కృష్ణా నదిపై 35, గోదావరిపై ఉన్న 71 ప్రాజెక్టులపై హక్కులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం కుట్రలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. బోర్డుల చైర్మన్లు, సభ్యులను నియమించే అధికారం కేంద్రానికి లభిస్తుందని, అలా జరిగితే రాష్ర్టాలకు ఎలాంటి హక్కులు ఉండబోవని ఆందోళన వ్యక్తంచేశారు. బోర్డుల నిర్వహణ కోసం రాష్ర్టాలు రూ.300 కోట్లను భరించాల్సి ఉంటుందన్నారు. కేంద్రం అనుసరిస్తున్న విధానాలను దుయ్యబట్టారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను స్వాగతించారు. అసెంబ్లీలో ఉద్యోగాల ప్రకటన, ఫీల్ట్ అసిస్టెంట్లను మళ్లీ విధుల్లోకి తీసుకోవడం, సెర్ప్, మెప్మా సిబ్బంది వేతనాల చెల్లింపు, మధ్యాహ్న భోజన కార్మికులకు వేతనాల పెంపుపై హర్షం వ్యక్తంచేశారు. మిగతా కాంట్రాక్టు ఉద్యోగులనూ క్రమబద్ధీకరించాలని కోరారు. ప్రజావ్యతిరేకంగా పాలన చేస్తున్న బీజేపీపై పోరాడే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని చెప్పారు. బీజేపీ అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 రోజుల్లో తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు సీపీఐ పార్టీ అనుబంధ సంఘాలు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు స్పష్టంచేశారు.