మద్దూరు(ధూళిమిట్ట), సెప్టెంబర్16: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి బీజేపీకి సంబంధం లేదని, అప్పటికి ఆ పార్టీ పుట్టనేలేదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఏమొఖం పెట్టుకొని హైదరాబాద్‌కు వస్తున్నారని ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్‌పల్లిలో సీపీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అమరవీరుల సంస్మరణ సభకు చాడ వెంకట్‌రెడ్డి హాజరయ్యారు. బైరాన్‌పల్లి బురుజు వద్ద అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొన్న సమరయోధులు పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకుంటే బీజేపీ ప్రభుత్వం తిరస్కరించిందని దుయ్యబట్టారు. మతోన్మాద బీజేపీని తెలంగాణలో అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగానే హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం జరిగిందన్నారు. బైరాన్‌పల్లి పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చడంతో పాటు గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు.