పెద్దపల్లి టౌన్, ఆగస్టు 26: ‘మతోన్మాదాన్ని తరిమికొట్టేందుకు మునుగోడులో టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాం.. ప్రజల మధ్య చిచ్చు పెడుతున్న బీజేపీ ఓటమే లక్ష్యంగా పనిచేస్తాం’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ పాలనను గాలికొదిలి ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడుతున్నారని.. బీజేపీ, దాని అనుబంధాల సంఘాలు మైనార్టీలు, దళితులపై దాడులకు దిగుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని నిప్పులు చెరిగారు. బీజేపీ దమనకాండను ఎదుర్కొనేందుకు లౌకిక, ప్రజాస్వామిక శక్తులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. శుక్రవారం పెద్దపల్లిలో నిర్వహించిన జిల్లా 3వ మహాసభలకు చాడ హాజరయ్యారు. అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తానని గద్దెనెక్కిన మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీని గాలికొదిలేసిందని ధ్వజమెత్తారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని మండిపడ్డారు. అభివృద్ధిని విస్మరించి ప్రజాస్వామిక ప్రభుత్వాలను కూలదోయడమే పనిగా పెట్టుకున్నదని, తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారును పడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు.