హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ) : స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టుల పొత్తు ప్రశ్నార్థకంగా మారింది. స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్తో కలిసి సాగితేనే మెరుగైన ఫలితాలు వస్తాయని సీపీఐ రాష్ట్ర నాయకత్వం భావిస్తున్నట్టు సమాచారం. అయితే, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ నేతల నుంచి తగిన సహకారం ఉండటం లేదని, ఒంటరిగా పోటీ చేయాలని క్షేత్రస్థాయి క్యాడర్ సూచిస్తున్నట్టు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా సీపీఐతో పొత్తుకు విముఖంగా ఉన్నట్టు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాద్రి-కొత్తగూడెం సీటును సీపీఐకి కేటాయించారు. స్థానిక ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు.
సీపీఐ కొంత బలంగా ఉన్న మునుగోడులో కూడా అన్ని స్థానాల్లో పోటీకి స్థానిక ఎమ్మెల్యేల కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. ఇంతకుముందు జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఆయన కమ్యూనిస్టుల కారణంగానే ఓడిపోయానన్న గట్టి అభిప్రాయంతో ఉన్నారు. ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్న సీపీఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కూడా క్షేత్రస్థాయిలో తమ పట్టు నిలపుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు వెల్లడించారు.
తాము బలంగా ఉన్న చోట స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని సీపీఎం స్పష్టమైన నిర్ణయం తీసుకున్నది. పార్టీ బలంగా లేని చోట ఇతర వామపక్ష పార్టీల అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించింది. ఖమ్మం, వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్నగర్ వంటి జిల్లాల్లో వీలైనన్ని స్థానాల్లో పోటీచేయాలని ఆ పార్టీ భావిస్తున్నది.