హైదరాబాద్, జూన్ 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక శక్తులను కూడగట్టాల్సిన బాధ్యతను తీసుకోవాలని సీపీఐ, సీపీఎం ముఖ్య నేతలు సూచించారు. హైదరాబాద్ సీపీఐ రాష్ట్ర కార్యాలయమైన మగ్దూంభవన్‌లో బుధవారం ఇరుపార్టీల రాష్ట్ర స్థాయి ముఖ్య నేతల సమావేశం జరిగింది. తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, ఉద్యమాలపై వారు సుమారు రెండు గంటల పాటు చర్చించారు.
తెలంగాణలో బీజేపీకి అవకాశం లేకుండా చేసేందుకు కేసీఆర్ చొరవ చూపాలని వారు కోరారు. హైదరాబాద్‌లో ఏప్రిల్ 9న జరిగిన ఉభయ పార్టీల సంయుక్త సమావేశం విజయవంతమైనదని, దానికి కొనసాగింపుగా జిల్లా స్థాయిల్లో కూడా ఉభయ పార్టీల ఉమ్మడి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్‌రెడ్డి, ఎన్ బాలమల్లేశ్, కలవేన శంకర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, పోతినేని సుదర్శన్‌రావు, జాన్‌వెస్లీ హాజరయ్యారు.