హైదరాబాద్, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన సీపీగెట్-25 ఫలితాలు విడుదలయ్యాయి. మాసాబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వుడిత్యాల బాలకిష్టారెడ్డి ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో మహిళలు సత్తాచాటారు. 35వేలకు పైగా మహిళలు పరీక్షలకు హాజరైతే 32వేల మంది క్వాలిఫై అయ్యారు. పురుషులు 19వేల మంది హాజరైతే 18వేల మంది అర్హత సాధించారు. ఈసారి మొత్తంగా 93.83% మంది పాస్ అయ్యారు. వెబ్ కౌన్సెలింగ్ ఈ నెల 10 నుంచి ప్రారంభంకానున్నది. మొత్తం మూడు విడతల్లో సీట్లు భర్తీచేస్తారు. 10 నుంచి 15 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, 18న సర్టిఫికెట్ వెరిఫికేషన్, 18-20 వరకు వెబ్ ఆప్షన్లు, 20న వెబ్ ఆప్షన్ల ఎడిటింగ్, 24న మొదటి విడత సీట్లు కేటాయిస్తారు. సీట్లు పొందిన వారు 27లోగా కాలేజీల్లో రిపోర్ట్‌చేయాలి. 29 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్చైర్మన్లు పురుషోత్తం, మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, వీసీలు ఎం కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సీట్లు ఎక్కువ.. క్వాలిఫై అయ్యింది తక్కువ
పీజీ కోర్సుల్లో చేరే వారి సంఖ్య ఏటా తగ్గుతున్నది. దీంతో సీపీగెట్‌కు దరఖాస్తులు పడిపోతున్నాయి. పలు కీలక కోర్సుల్లో ఉన్న సీట్ల కంటే క్వాలిఫై అయిన వారి సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం. అత్యధిక డిమాండ్ ఉండే ఎంకాంలో 6,562 సీట్లుంటే, 3,858 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఎమ్మెస్సీ కెమిస్ట్రీలో 3,607 సీట్లకు 3,291 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్‌లో 2,950 సీట్లకు 1,936, ఎమ్మెస్సీ గణితంలో 3,648 సీట్లకు 2,070, ఎమ్మెస్సీ ఫిజిక్స్‌లో 1,767 సీట్లకు 1,122 మంది చొప్పున మాత్రమే క్వాలిపై అయ్యారు. క్వాలిఫై అయి న వారు అంతా చేరుతారా? అంటే అనుమానమే. సీట్ల సంఖ్య ఎక్కువగా ఉండి దరఖాస్తులు తక్కువగా వచ్చిన ఏడు కోర్సులకు పరీక్షలు నిర్వహించలేదు. ఎంఏ అరబిక్, కన్నడ, మ రాఠి, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్, ఎలక్ట్రానిక్స్, సెరికల్చర్ కోర్సులకు పరీక్ష లేకుండా వచ్చిన వారికి వచ్చినట్టు సీట్లు కేటాయించనున్నారు.