హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): తెలుగు రాష్ర్టాల్లో తీవ్ర సంచలనం రేపిన పదేండ్ల బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకు వచ్చిన పక్కింటి బాలుడు దొరికిపోతానేమోనన్న భయంతో ఆ బాలికను హత్య చేశాడని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి తెలిపారు. కూకట్పల్లి, సంగీత్‌నగర్‌లో పదేండ్ల సహస్రాణి అనే బాలిక ఈ నెల 18న హత్యకు గురైన సంగతి తెలిసిందే. మిస్టరీగా మారిన ఈ హత్య కేసును ఎట్టకేలకు ఛేదించామని కమిషనర్ వెల్లడించారు. బాలికను హత్య చేసింది వారి పక్కింట్లో ఉండే 14 ఏండ్ల బాలుడేనని తెలిపారు. హతురాలు సహస్రాణి సోదరుడి వద్దనున్న క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకే నిందితుడు వారి ఇంట్లోకి వచ్చాడని అన్నారు. ‘బాలిక తల్లిదండ్రులు బయటకు వెళ్లడం చూసిన నిందితుడు తమ భవనం మూడో అంతస్తు నుంచి గోడ దూకి పక్కింట్లోకి వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉంటుందని భావించి దానిని కోసేందుకు తన వెంట ఒక పదునైన పరికరాన్ని తీసుకెళ్లాడు.
అయితే ఇంటికి తాళం వేసి లేకపోవడంతో..నేరుగా లోపలికి వెళ్లి క్రికెట్ బ్యాట్ తీసుకొని వస్తుండగా.. లోపల బెడ్రూమ్లో టీవీ చూస్తున్న సహస్రాణి తొలుత దొంగా దొంగా అని అరిచింది. కానీ వచ్చింది తన సోదరుడి స్నేహితుడేనని తెలిసి.. బ్యాట్ ఎత్తుకుపోతున్న విషయం అమ్మకు చెప్తానన్నది. దీంతో దొరికిపోతానని భావించిన బాలుడు భయాందోళనకు గురై తాళం కోయడానికి తెచ్చుకున్న పరికరంతో బాలికను విచక్షణారహితంగా పొడిచాడు. తరువాత వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లిపోయాడు. కాగా, పోలీసులు సీసీటీవీ ఫుటేజీలో చూస్తే ఎవరూ ఆ భవనంలోకి వెళ్లినట్టు కనిపించలేదు. అనుమానితుల్ని విచారించినా ఫలితం లేదు. అయితే పోస్ట్‌మార్టం నివేదిక కీలక విషయాలను వెల్లడించింది. బాలిక ఒంటిపై ఉన్న కత్తిపోట్లు బలంగా లేవని, తక్కువ లోతు వరకే ఉన్నాయని, ఎవరో బలహీనమైన వ్యక్తి లేదా చిన్న వయస్సువారు పొడిచి ఉండవచ్చని ఫోరెన్సిక్ నివేదిక వెల్లడించింది. నిందితుడి నివాస భవనంలో ఉంటున్న ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి.. హత్య జరిగిన రోజున ఓ బాలుడు గోడదూకి వెళ్లటం చూశానని పోలీసులకు చెప్పాడు. దీంతో తమ పని సునాయాసమైంది’ అని కమిషనర్ వివరించారు.