Omicron | ఒమిక్రాన్ సుడిగాలిలా చుట్టుకొస్తుండటంతో ప్రపంచదేశాలన్నీ గజగజ వణుకుతున్నాయి. ప్రజల ప్రాణాలు కాపాడాలంటే బూస్టర్ డోస్ ఒక్కటే శరణ్యమనే భావనకు వచ్చాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా మూడో డోస్‌కు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే అనేక దేశాలు తమ పౌరులకు బూస్టర్ డోస్ వేస్తున్నాయి. అయితే మన దేశంలో మాత్రం ఇప్పటికీ బూస్టర్ డోస్ ( Booster dose ) ఊసే లేదు.
కొవిడ్ మొదటి దశ సమయంలో వైరస్ నుంచి రక్షణ పొందాలంటే టీకా రెండు డోసుల వేసుకోవాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. దీంతో ప్రతి ఒక్కరికీ కనీసం రెండు డోసులు వేసేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే టీకా వేసిన ఐదారు నెలల తర్వాత శరీరంలో ఉత్పత్తి అయిన ప్రతిరక్షకాల సంఖ్య తగ్గుతున్నదని పరిశోధనల్లో తేలింది.ఈ నేపథ్యంలో బూస్టర్ డోస్ వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం 73 దేశాల్లో బూస్టర్ డోస్ వేస్తున్నారు.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పిస్తాయో లేదో ఇంకా తేలలేదు. అయితే ఇప్పటివరకు వచ్చిన అన్ని వేరియంట్ల నుంచి టీకాలు రక్షించాయని నిపుణులు గుర్తు చేస్తున్నారు. కాబట్టి టీకాలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తే కచ్చితంగా ఒమిక్రాన్ నుంచి రక్షణ కల్పిస్తాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ వైరస్ సోకినా.. ప్రాణాలమీదికి రాకపోవచ్చని చెప్తున్నారు.
సోమవారం నాటికి దేశవ్యాప్తంగా 25 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నట్టు కేంద్రం తెలిపింది. అయినా బూస్టర్‌పై తాత్సారం చేస్తున్నది. మరోవైపు, కొవిడ్ ప్రభావం తగ్గిన నేపథ్యంలో చాలామంది రెండో డోస్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. దీంతో నిల్వలు పేరుకుపోతున్నాయి. వాటి జీవిత కాలం (ఎక్స్పైరీ డేట్) తక్కువ. కాబట్టి వృథా చేసే బదులు బూస్టర్‌గా వాడుకోవాలని నిపుణులు కోరుతున్నారు.
రెండు డోసులు వేసుకున్నవారికి ఆరు నెలల తర్వాత బూస్టర్ డోస్ తీసుకుంటే మంచిది. మన దేశంలో వృద్ధులు, హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వారియర్లకు మొదటగా రెండు డోసులు వేశారు. వీరిలో చాలామంది టీకా తీసుకొని ఏడెనిమిది నెలలు గడుస్తున్నది. వీరికి బూస్టర్ డోస్ ఇచ్చే దిశగా ఆలోచన చేయాలి. ఆ తర్వాత క్రమంగా అందరికీ విస్తరించాలి.
– డాక్టర్ కిరణ్ మాదాల, క్రిటికల్ కేర్ హెడ్, నిజామాబాద్ జీజేహెచ్
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అనే ఎందుకు పేరు పెట్టారు? దీనికి చైనా అధ్యక్షుడికి సంబంధమేంటి?
Omicron : తొలిసారి ఒమిక్రాన్ వైరస్‌ను గుర్తించింది ఎవరో తెలుసా?
Omicron | ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనదా? దీన్ని చూసి ప్రపంచ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి?
Omicron : కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై నెటిజన్ల మీమ్స్ వైరల్
B.1.1.529 | కరోనా కొత్త వేరియంట్ హెచ్ఐవీ రోగుల నుంచి పుట్టుకొచ్చిందా? ఇది అంత ప్రమాదకరమా?