Omicron variant | దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్ కరోనా వేరియంట్ ( B.1.1.529 ) ఇప్పుడు ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఇప్పటివరకు మనం చూసిన అన్ని వేరియంట్లతో పోలిస్తే ఇది చాలా ప్రమాదకరమని తెలియడంతో వణికిపోతున్నారు. దీనికి తగ్గట్టుగానే వైరస్ వ్యాప్తి కూడా చాలా వేగంగా ఉంది. ఆఫ్రికన్ దేశాల్లో వెలుగుచూసిన ఈ వైరస్.. చాలా తొందరగానే హాంకాంగ్, ఆస్ట్రేలియాకు చేరింది. దీంతో హడలెత్తిపోయిన ప్రపంచ దేశాలు వెంటనే అప్రమత్తమయ్యాయి. పరిస్థితులు చేయిదాటకముందే అదుపులోకి తీసుకురావాలని విదేశీ ప్రయాణాలపై పలు ఆంక్షలను తీసుకొచ్చాయి. ఈ వేరియంట్‌ను అడ్డుకునేందుకు.. థర్డ్ వేవ్ రాకుండా చూసేందుకు భారత్‌లోనూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇంతలా జనాల్ని భయపెట్టిస్తున్న ఈ ఒమిక్రాన్ వేరియంట్ ( B.1.1.529 ) ఎందుకు అంత ప్రమాదకరం? ఈ వేరియంట్ గురించి ప్రపంచ దేశాలు ఏం చెబుతున్నాయి? ఒకసారి గమనిద్దాం..
గత కొద్ది రోజులుగా దక్షిణాఫ్రికాలో రోజూవారి సగటు కరోనా కేసులు 200కు పైగా కేసులు నమోదవుతున్నాయి. బుధవారం ( నవంబర్ 24 న) ఒక్కరోజే 1200 కేసులు నమోదయ్యాయి. ఆ మరుసటి రోజు దానికి రెట్టింపు అంటే 2465 కేసులు రికార్డయ్యాయి. మరణాలు కూడా అనూహ్యంగా ఆరు రెట్లు పెరిగాయి. దీంతో రంగంలోకి దిగిన శాస్త్రవేత్తలు మూలాలను వెతికే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే వారు బి.1.1.529 కొత్త వేరియంట్‌ను గుర్తించారు. దీనికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ( డబ్ల్యూహెచ్‌వో ) ఒమిక్రాన్ అని నామకరణం చేసింది. దీన్ని ‘వేరియంట్ ఆఫ్ కన్సర్న్’గా ప్రకటించింది. ఈ కొత్త వేరియంట్‌కు పెద్ద సంఖ్యలో మ్యుటేషన్లు ఉన్నాయని.. దీనివల్ల రీఇన్ఫెక్షన్ ప్రమాదం పెరిగినట్లు హెచ్చరించింది.
చైనాలో తొలుత కనిపించిన కరోనా వైరస్‌తో పోలిస్తే బి.1.1.529 వేరియంట్ చాలా భిన్నమైనదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సెకండ్ వేవ్ సమయంలో ప్రపంచాన్ని గడగడలాడించిన డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్ల కంటే కూడా ఇది ప్రమాదకరమైనదని హెచ్చరిస్తున్నారు. డెల్టా, డెల్టా ప్లస్ వేరియంట్లలోని స్పైక్ ప్రోటీన్లలో రెండు, మూడు ఉత్పరివర్తనాలను మాత్రమే గుర్తించారు. కానీ ఒమిక్రాన్‌లో మాత్రం మొత్తం 50 మ్యుటేషన్లు ఉండగా.. స్పైక్ ప్రోటీన్‌లో 30కి పైగా ఉత్పరివర్తనాలు ఉన్నట్లు గుర్తించారు. కరోనా వైరస్ మనిషి కణాల్లోకి ప్రవేశించాలంటే స్పైక్ ప్రోటీన్‌నే కీలకం. కరోనా వైరస్ చుట్టూ ముళ్లలా ఉండే ఈ ప్రోటీన్.. వైరస్ కొమ్ముల్లా కనిపిస్తుంది. ఈ స్పైక్ ప్రోటీన్ వల్లే శరీరంలోని ఏసీఈ2 కణాలకు కరోనా వైరస్ అతుక్కుంటోంది. ఈ ప్రోటీనే లేకపోతే వైరస్ ఎక్కువసేపు బతకలేదు. కానీ ఒమిక్రాన్ విషయానికొస్తే స్పైక్ ప్రోటీన్‌లోనే 30కి పైగా ముట్యేషన్లు ఉండటం ఇప్పుడు ఆందోళన కలిగిస్తుంది.
ఈ ఉత్పరివర్తనాలలో ఆల్ఫా, Mu, గామా, బి.1.1.318 వేరియంట్లలో కనిపించిన పి881హెచ్ మ్యుటేషన్ కూడా ఒమిక్రాన్ వేరియంట్లో కనిపించింది. ఎన్5017వై మ్యుటేషన్ కూడా ఇందులో ఉన్నట్లు గుర్తించారు. ఈ మ్యుటేషన్ కారణంగా ఒమిక్రాన్ వేరియంట్ చాలా తేలిగ్గా వ్యాప్తి చెందగలదు. అలాగే మరికొన్ని ఉత్పరివర్తనాలు యాంటీబాడీస్ గుర్తించకుండా.. రోగ నిరోధకతను తప్పించుకుని మరీ దాడి చేయగలదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే ఇప్పటివరకు చూసిన అన్ని వేరియంట్ల కంటే ఒమిక్రాన్ అత్యంత ప్రమాదకరమైనదని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరించింది.
రోగ నిరోధక శక్తి లేని వ్యక్తిలో దీర్ఘకాలిక సంక్రమణ ద్వారా బి.1.1.529 వేరియంట్ పుట్టుకొచ్చి ఉంటుందని లండన్‌లోని యూసీఎల్ జెనెటిక్స్ ఇన్స్టిట్యూట్కు చెందిన బయాలజీ ప్రొఫెసర్, డైరెక్టర్ ఫ్రాంకోయిస్ బలోక్స్ వెల్లడించారు. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తి అంటే.. హెచ్ఐవీ ఎయిడ్స్ రోగి ద్వారా ఈ వేరియంట్ ఉత్పన్నమై ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రపచంలోనే అత్యధికంగా ఎయిడ్స్ రోగులు ఉన్న దేశం దక్షిణాఫ్రికా. ఈ దేశంలో 8.2 మిలియన్లకు పైగా హెచ్ఐవీ బాధితులు ఉన్నారు. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాలో బయటపడ్డ బీటా వేరియంట్ హెచ్ఐవీ సోకిన వ్యక్తి నుంచే ఉత్పన్నమైనట్లు అప్పట్లో శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో ఇప్పుడు కూడా ఈ కొత్త వేరియంట్ వారి నుంచే వచ్చి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.
కరోనా వ్యాక్సిన్లు కొత్త వేరియంట్‌పై ఏ మేరకు సమర్థవంతంగా పనిచేస్తాయన్న విషయాన్ని ప్రస్తుతం చెప్పలేమని యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్త షారన్ పికాక్ తెలిపారు. వైరస్ స్పైక్ ప్రొటీన్‌లో కనుగొన్న 30 మ్యుటేషన్లలో కొన్నింటి వివరాలు ఇంకా తమకు తెలియాల్సి ఉన్నదన్నారు. దీనిపై పరిశోధనలు చేయడానికి మరికొన్ని వారాల సమయం పడుతుందన్నారు. గతంలో వైరస్ బారిన పడి కోలుకున్న వారితోపాటు, వ్యాక్సిన్ వేసుకున్నవారికి కూడా ఈ వేరియంట్ సులభంగా సోకొచ్చని బాలౌక్స్ పేర్కొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అనే ఎందుకు పేరు పెట్టారు? దీనికి చైనా అధ్యక్షుడికి సంబంధమేంటి?
Omicron | ఆఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా..
Omicron : కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై నెటిజన్ల మీమ్స్ వైరల్
B.1.1.529 | కరోనా కొత్త వేరియంట్ హెచ్ఐవీ రోగుల నుంచి పుట్టుకొచ్చిందా? ఇది అంత ప్రమాదకరమా?