Booster Dose | హైదరాబాద్ : తెలంగాణలో రేపట్నుంచి మళ్లీ కొవిడ్ బూస్టర్ డోస్ పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోస్ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
టీకాల పంపిణీపై కేంద్రం చేతులెత్తేయడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. 5 లక్షల కార్బేవ్యాక్స్ టీకా డోసులను ప్రజలకు ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. బుధవారం నుంచి రాష్ట్రంలోని అన్ని పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీల్లో బూస్టర్ డోస్ పంపిణీ చేయనున్నారు. మొదటి రెండు డోసులు కొవిషీల్డ్ లేదా కొవాగ్జిన్ తీసుకున్నా బూస్టర్ డోస్‌గా కార్బే వ్యాక్స్ తీసుకోవచ్చు అని వైద్యాధికారులు సూచించారు.