టీకాలు వచ్చేశాయ్

- పుణె నుంచి 3.64 లక్షల డోసుల రాక
- సీరం నుంచి వచ్చిన కొవిషీల్డ్ వ్యాక్సిన్
- బందోబస్త్ మధ్య కోఠి స్టోర్‌కు తరలింపు
- నేడు జిల్లాల వ్యాక్సిన్ కేంద్రాలకు చేరవేత
- రాష్ట్రవ్యాప్తంగా 16 నుంచి వ్యాక్సినేషన్
- వారంలో 4 రోజులు టీకాల కార్యక్రమం
- తొలి విడుతలో రాష్ట్రం కోటా 6.50 లక్షల డోసులు
- టీకా తయారీ 1.11.2020
- ఎక్స్పైరీ 29.4.2021
- ఒక్కో బాక్సులో 1200 వయల్స్
- ఒక్కో వయల్‌లో 10 డోసులు
కరోనా మహమ్మారికి కళ్లెం వేసే టీకాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. మరో 3 రోజుల్లో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ మొదలుకానున్నది. తొలుత ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు, ఆ తర్వాత ప్రాధాన్యక్రమాన్ని అనుసరించి టీకాలు వేస్తారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ‘కొవిషీల్డ్' టీకాలను గట్టి పోలీస్ బందోబస్తు మధ్య కోఠిలోని వ్యాక్సిన్ స్టోర్‌కు తరలించారు. టీకాల పంపిణీలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని, లబ్ధిదారులను వ్యాక్సిన్ కేంద్రాలకు తరలించాలని కోరుతూ మంత్రి ఈటల వారికి లేఖలు రాశారు.
హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రత్యేక కార్గో విమానంలో కొవిషీల్డ్ వ్యాక్సిన్ మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరింది. మొత్తం 31 బాక్సుల్లో నిల్వచేసిన 3.64 లక్షల డోసులు ఎయిర్‌పోర్టుకు చేరుకోగా అప్పటకే సిద్ధంగా ఉంచిన ప్రత్యేక శీతల వాహనంలోకి నిపుణుల పర్యవేక్షణలో చేరవేశారు. అనంతరం పోలీసు భద్రత నడుమ కోఠిలోని స్టేట్ వ్యాక్సిన్ స్టోర్‌కు తరలించారు. ఒక్కో బాక్సులో 1200 వరకు వయల్స్ ఉన్నాయి. ఒక్కో వయల్‌లో 5 ఎంఎల్ పరిమాణం టీకా ఉండగా.. దానిని పది డోసులుగా వేస్తారు. డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, కరోనా వ్యాక్సినేషన్ అధికారి డాక్టర్ జీ శ్రీనివాసరావు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ హెల్త్ డాక్టర్ రమేశ్‌రెడ్డి, టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇమ్యునైజేషన్ అధికారిణి డాక్టర్ సుధీరా వ్యాక్సిన్లను స్వాధీనం చేసుకున్నారు.
సర్వమత ప్రార్థనల అనంతరం స్టేట్ వ్యాక్సిన్ స్టోర్‌లో ఉన్న 40 క్యూబిక్ మీటర్ల కూలర్లలో వ్యాక్సిన్లను నిల్వచేశారు. వ్యాక్సిన్ నిల్వ కేంద్రం వద్ద సాధారణ సెక్యూరిటీతోపాటు పోలీసు భద్రతను పెంచారు. కేంద్రం నుంచి వచ్చిన సమాచారం మేరకు రాష్ట్రానికి మొత్తం 6.50 లక్షల డోసులు రావాల్సి ఉండగా, మొదటి విడుతగా 3.64 లక్షల డోసులు వచ్చాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో సీరం ఇన్స్టిట్యూట్ కొవిషీల్డ్‌ను అభివృద్ధి చేసింది. సుమారు మూడు కోట్ల డోసులు నిల్వ చేసే సామర్థ్యం తెలంగాణకు ఉన్నదని టీఎస్ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు కూడా తొలివిడుత కొవిషీల్డ్ టీకాలు విజయవాడ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఆ రాష్ర్టానికి 4.75 లక్షల డోసులు అందించనున్నారు.
టీకాల బాధ్యత మనదే : ఈటల
కరోనా టీకాల పంపిణీలో ప్రజాప్రతినిధులందరూ భాగస్వాములు కావాలని వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తిచేశారు. సర్పంచుల నుంచి మంత్రుల వరకు ఆయన మంగళవారం ప్రత్యేకంగా లేఖలు రాశారు. ‘సీఎం కేసీఆర్ నాయకత్వంలో, సరైన వ్యూహంతో కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో విజయం సాధించాం. ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ విధానం పక్కాగా అనుసరించి వైరస్ నుంచి ప్రజలను కాపాడుకోగలిగాం. ఈ ప్రక్రియలో వైద్యారోగ్య సిబ్బందితో పాటు పోలీసు, మున్సిపల్, పంచాయతీరాజ్ తదితర శాఖల సిబ్బంది 24 గంటలూ శ్రమించారు. వీరందరికి ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు’ అని లేఖలో పేర్కొన్నారు. ఈనెల 16 నుంచి రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అందరూ మద్దతుగా నిలవాలని, భాగస్వాములై ప్రక్రియను పూర్తిచేయాలని సూచించారు. వ్యాక్సిన్‌పై ప్రజలకు అవగాహన కల్పించాలని, ప్రాధాన్యక్రమంలో వ్యాక్సిన్ అందించడంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని ఈటల ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తిచేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరిగి, కరోనా రహిత రాష్ట్రంగా తెలంగాణ మారాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పాన్ని నెరవేర్చాలని కోరారు.
40 ప్రైవేటు, 99 ప్రభుత్వ కేంద్రాల్లో టీకాలు
వ్యాక్సిన్ పంపిణీచేసే కేంద్రాల్లో 6 ప్రైవేటు టీచింగ్ దవాఖానలు ఉండగా, 34 ప్రైవేటు దవాఖానలు ఉన్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలోని 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 15 యూపీహెచ్‌సీలు, 21 సీహెచ్‌సీలు, 12 ఏరియా దవాఖానలు, 20 జిల్లా దవాఖానలు, 6 ప్రభుత్వ టీచింగ్ దవాఖానల్లో వ్యాక్సినేషన్ నిర్వహించనున్నారు. ఇక గాంధీ మెడికల్ కాలేజీ, నార్సింగ్ ఆర్‌హెచ్‌సీలో నిర్వహించే ప్రక్రియను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిలకించి, వ్యాక్సినేటర్లు, లబ్ధిదారులతో మాట్లాడనున్నారు. మిగతా 137 కేంద్రాల్లోని సిబ్బంది, లబ్ధిదారులు ప్రధాని కార్యక్రమాన్ని తిలకించేలా ఇంటర్నెట్, టీవీ సౌకర్యాలను అధికారులు కల్పించనున్నారు.
నేడు జిల్లాలకు పంపిణీ
కోఠిలోని స్టేట్ వ్యాక్సిన్ స్టోర్ నుంచి కరోనా వ్యాక్సిన్లు బుధవారం జిల్లాలకు చేరనున్నాయి. తొలుత ఉమ్మడి వ్యాక్సిన్ స్టోర్ కేంద్రాలకు, అక్కడినుంచి జిల్లా కేంద్రాలకు, వ్యాక్సిన్ బూత్‌లకు సరఫరా కానున్నాయి. మొత్తంగా 900 కోల్డ్‌చైన్ స్టోరేజ్ కేంద్రాలకు తరలిస్తారు. ఈనెల 16న 139 (40 ప్రైవేటు, 99 ప్రభుత్వ) కేంద్రాల్లో 13,900 మంది హెల్త్ కేర్ వర్కర్లకు టీకాలు వేయనున్నారు. ఈనెల 17వ తేదీ ఆదివారం సెలవు తర్వాత 18 నుంచి మొత్తం 1,213 సెంటర్లలో పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. వారంలో బుధ, శనివారాలు మినహా మిగిలిన నాలుగు రోజులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొవిడ్ టీకాలు వేయనున్నారు. బుధ, శనివారాల్లో పిల్లలకు వేసే సార్వత్రిక టీకాల కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఆయా కేంద్రాల్లో వైద్యారోగ్య శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. వ్యాక్సినేషన్ ప్రక్రియపై సంబంధిత అధికారులు, సిబ్బందికి శిక్షణ సైతం పూర్తిచేశారు. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ తీరును ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి డాక్టర్ పుట్ట రాజు పర్యవేక్షిస్తున్నారు.
మమ్మల్ని ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా గుర్తించండి
కరోనాపై పోరులో తమను కూడా ఫ్రంట్‌లైన్ వర్కర్స్ జాబితాలోకి చేర్చి వ్యాక్సిన్ వేయాలని ఆల్ ఇండియా డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ (ఏఐడీసీఓసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు ఫెడరేషన్ అధ్యక్షుడు డాక్టర్ జయంత్ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు.
ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ : సీఎస్
కరోనా టీకాలను అందుబాటులో ఉంచడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మొదటిదశలో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యసిబ్బందికి టీకాలు వేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీ ఏర్పాట్లపై సోమేశ్‌కుమార్ మంగళవారం ఉదయం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అన్ని వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద అవసరమైన దానికంటే అదనంగా టీకాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి కేంద్రంలో ఒక ప్రత్యేక అధికారిని నియమించాలని ఆదేశించారు. మొదటిరోజు పరిమిత సంఖ్యలో వ్యాక్సిన్ వేసి పరిణామాలను నిశితంగా గమనించాలని సూచించారు. పరిస్థితులనుబట్టి జోరు పెంచాలని చెప్పారు.
ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలన్నారు. ఎక్కడైనా టీకా వికటిస్తే వెంటనే వైద్యం అందించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ కూడా కలెక్టర్లతో వ్యాక్సినేషన్ గురించి మాట్లాడారు. జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్లు టెలి కాన్ఫరెన్స్ నిర్వహించాలని చెప్పారు. వ్యాక్సినేషన్ కేంద్రంలో ఎమర్జెన్సీ కిట్స్ అందుబాటులో ఉండేలా చూడాలని, అవసరమైతే దవాఖానలకు తరలించేందుకు అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని సూచించారు. వ్యాక్సిన్ వేసేందుకు అదనంగా సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని, తొలిరోజున కేవలం 30 మంది లబ్ధిదారులను మాత్రమే అనుమతించాలని, ముందస్తుగా గుర్తించిన లబ్ధిదారులను జిల్లా, ఇతర సిబ్బంది సాయంతో కేంద్రాలకు తరలించాలని చెప్పారు. కొవిన్ యాప్‌తోపాటు అదనపు బ్యాకప్ కోసం రిజిస్టర్లో వివరాలను నమోదుచేయాలని పేర్కొన్నారు.
తాజావార్తలు
- ఎర్రకోటను సందర్శించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
- మస్క్ vs బెజోస్.. అంతరిక్షం కోసం ప్రపంచ కుబేరుల కొట్లాట
- శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- కుల్గామ్‌లో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు
- జైలు నుంచి శశికళ విడుదల
- ఎర్రకోట ఘటన వెనుక కాంగ్రెస్, ఖలీస్తానీలు : కర్ణాటక మంత్రి
- షాకయ్యే చరిత్ర 'ఆపిల్'ది
- రైతుల నిరసనను ఖండించిన మాయావతి
- బోల్తాపడ్డ డీసీఎం.. 70 గొర్రెలు మృతి
- కోవిడ్ టీకా రెండవ డోసు తీసుకున్న కమలా హ్యారిస్