హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ): కరోనా బారినపడి కోలుకున్నా దాని ప్రభావం నీడలా వెంటాడుతూనే ఉన్నది. కొవిడ్ బారిన పడినవారికి పేగులకు ‘గ్యాంగ్రిన్’ సమస్య పొంచి ఉన్నట్టు తాజా పరిశీలనలో తేలింది. ఈ సమస్యను సకాలంలో గుర్తించకపోతే ప్రాణాలకే ముప్పు వాటిల్లవచ్చని వైద్యులు చెప్తున్నారు. హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందిన ఆరుగురు కొవిడ్ బాధితుల్లో ఇటీవల ఈ రుగ్మతను గుర్తించినట్టు సర్జికల్ గ్యాస్ట్రో విభాగాధిపతి ప్రొఫెసర్ బీరప్ప వెల్లడించారు. సాధారణ రోగుల్లో కంటే కొవిడ్ బారిన పడినవారిలోనే గ్యాంగ్రిన్ రుగ్మత అధికంగా కనిపిస్తున్నదని, పేగులపై కూడా కరోనా వైరస్ ప్రభావం చూపుతుండటమే ఇందుకు ప్రధాన కారణమని ప్రొఫెసర్ బీరప్ప స్పష్టం చేశారు. దీని వల్ల పేగుల్లో రక్తం గడ్డకట్టి రక్తప్రసరణ నిలిచిపోతుందని, ఫలితంగా పేగులు చచ్చుబడిపోయి కుళ్లిపోతాయని తెలిపారు. తద్వారా జీర్ణ వ్యవస్థ దెబ్బతిని శరీరానికి శక్తి అందక రోగి మృత్యువాత పడే అవకాశాలున్నాయని వివరించారు. కడుపులో నొప్పి, నల్లరంగులో మలవిసర్జన, తరచూ వాంతులు, విరేచనాలు కావడం గ్యాంగ్రిన్ లక్షణాలని తెలిపారు. ఇలాంటి లక్షణాలున్నవారు వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.