రాజోళి, జూలై 29 : భూతగాదాల కారణంగా దాయాదులు తమ సోదరుడిని హతమార్చారు. మృతదేహాన్ని మరోచోట పడేసేందుకు ముసుగు కప్పి బైక్పై తరలించారు. కొందరు వీడియోలు, ఫొటోలు తీయడంతో ఈ ఘటన వెలుగుచూసింది. ఈ హత్య జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలం పెద్దధన్వాడలో సోమవారం చోటుచేసుకున్నది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన దుబ్బన్న, శేషిరెడ్డి(49), నాగిరెడ్డి అన్నదమ్ములు. వీరు ముగ్గురి మధ్య 12 ఏండ్లుగా భూతగాదాలు ఉన్నాయి. గొడవల కారణంగా కొంతకాలం కిందట దుబ్బన్న ఊరు వదిలి వెళ్లిపోగా.. నాగిరెడ్డి, శేషిరెడ్డి గ్రామంలోనే ఉంటున్నారు. వీరిమధ్య గొడవలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో నాగిరెడ్డి, దుబ్బన్న కొడుకు మహేశ్ సోమవారం శేషిరెడ్డిని హత్య చేసి.. ఏపీలోని కర్నూల్ జిల్లా కొత్తకోట శివారులో మృతదేహాన్ని పడేసేందుకు బైక్పై తీసుకెళ్లారు. అనుమానం వచ్చిన కొందరు వ్యక్తులు సెల్ఫోన్లో ఫొటోలు, వీడియోలు తీసి సోషల్మీడియాలో పోస్ట్చేశారు. ఈ ఘటనపై కొత్తకోట గ్రామస్థులు కర్నూల్ జిల్లా సీ బెళగల్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో గుడూరు, సీ బెళగల్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసినట్టు సమాచారం. అయితే, తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని రాజోళి పోలీసులు తెలిపారు.