నాంపల్లి క్రిమినల్ కోర్టులు, జూలై 4 (నమస్తే తెలంగాణ): ‘మహా న్యూస్’ టీవీ చానల్ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టయిన కొల్లి సాయినాగేశ్వరరావును జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం నాంపల్లి కోర్టు ఎదుట హాజరుపర్చారు. దీంతో పోలీస్ అధికారులు తనను తీవ్రంగా వేధించారని, చిత్రహింసలకు గురిచేశారని నిందితుడు కోర్టుకు వివరించారు. దీన్ని సీరియస్గా పరిగణించిన కోర్టు.. పోలీసులకు నోటీసులు జారీచేసింది. నిందితుడి ఆరోపణలపై వెంటనే వివరణ ఇవ్వాలని దర్యాప్తు అధికారికి స్పష్టం చేసింది. అనంతరం సాయినాగేశ్వరరావును 14 రోజులపాటు రిమాండ్కు తరలించాలని ఆదేశించడంతో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించారు. దీంతో ఈ కేసులో పోలీసులకు వరుసగా రెండోసారి ఎదురుదెబ్బ తగిలినట్టయింది. కాగా, విచారణాధికారి వివరణ ఇ వ్వకపోతే మానవహక్కుల సంఘా న్ని ఆశ్రయిస్తామని నిందితుడి తర ఫు న్యాయవాది తెలిపారు.