సిర్పూర్(టీ), సెప్టెంబర్ 26 : పశువులను మేత కోసం తోలుకెళ్లిన దంపతులిద్దరూ అటవీ జంతువుల దాడిలో మృతిచెందిన ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్(టీ) మండలం అచ్చల్లి అటవీప్రాంతంలో జరిగింది. అచ్చల్లికి చెందిన దూలం శేఖర్(45)- సుశీల (42) దంపతులు 15 ఏళ్లుగా పశువుల కాపరులుగా జీవిస్తున్నారు. ఎప్పటిలాగే గురువారం పశువులను తోలుకొని భీమన్న అటవీ ప్రాంతానికి వెళ్లారు. సాయంత్రం పశువులు గ్రామానికి తిరిగివచ్చినా, ఆ దంపతులిద్దరూ కనిపించలేదు. దీంతో ఆందోళన చెందిన కూతుళ్లు దూలం రాజేశ్వరి, మౌనిక, రోహిణి, కుమారుడు రోహిత్ ఈ విషయాన్ని గ్రామస్థులకు తెలిపారు.
కుటుంబ సభ్యులు, స్థానికులు కలిసి పోలీసులు, అటవీ అధికారులకు సమాచారం అందించారు. సిర్పూర్(టీ) ఎస్ఐ సురేశ్ ఆధ్వర్యంలో పోలీసులు, అటవీ అధికారులు, గ్రామస్థులు అటవీ ప్రాంతంలో వారికోసం గాలించారు. శుక్రవారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో భీమన్న అటవీ ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలను గుర్తించారు. కాగజ్‌నగర్ డీఎస్పీ వాహీదుద్దీన్, కౌటాల సీఐ సంతోష్, అటవీ అధికారులు మృతదేహాలను పరిశీలించారు.
అనుమానాస్పదంగా మృతి చెందిన దంపతులిద్దరికీ సిర్పూర్(టీ) ప్రభుత్వ సామాజిక దవఖానలో ఫోరెన్సిక్ వైద్యులతో పోస్టుమార్టం నిర్వహించారు. అటవీ జంతువు దాడి చేయడం వల్లే దంపతులు మృతి చెందినట్టు ఫోరెన్సిక్ వైద్యులు ప్రాథమిక సమాచారం అందించినట్టు కాగజ్‌నగర్ ఎఫ్‌డీవో సుభాష్భోబడే, సిర్పూర్(టీ) ఎఫ్ఆర్వో ప్రవీణ్‌కుమార్ తెలిపారు. పోస్టుమార్టం అనంతరం దూలం శేఖర్-సుశీల మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించగా, సాయంత్రం అంత్యక్రియలు పూర్తిచేశారు.
గిరిజన కుటుంబాన్ని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ భరోసానిచ్చారు. రూ.20 లక్షలు బాధిత కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్టు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం, వారంలోగా ఇందిరమ్మ ఇల్లు మంజురూ చేయిస్తామని హామీ ఇచ్చారు. తక్షణసాయం కింద రూ. 20 వేలను పిల్లలకు అందజేశారు. తల్లితండ్రులను కోల్పోయిన పిల్లలను సిర్పూర్(టీ) ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్ పరామర్శించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పిల్లలతో ఫోన్లో మాట్లాడి ఓదార్చారు. అన్ని విధాలా అండగా ఉంటామని భరోసానిచ్చారు.