నూతనకల్, నవంబర్ 25 : భార్యాభర్తలుగా వారు ఎంతో అన్యోన్యంగా జీవనం సాగించారు. వృద్ధాప్యంలో ఒకరికొకరు తోడుగా ఉన్నారు. అనారోగ్యం కారణంగా ఒకేరోజు మృతి చెందారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాలకు చెందిన కొమ్ము వీరయ్య (75)- కొమ్ము ఎల్లమ్మ( 70) భార్యాభర్తలు. వీరికి ముగ్గురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు.
కొడుకులు వేరుగా ఉండడంతో వంతులవారిగా తల్లిదండ్రుల ఆలనాపాలన చూస్తున్నారు. వృద్ధ దంపతులు వేరుగా ఒక ఇంట్లో ఉంటున్నారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో వారు మంచానికే మరిమితం కాగా కుటుంబ సభ్యులు సపర్యలు చేస్తున్నారు. అన్యోన్యంగా ఉండే భార్యాభర్తలు ఆదివారం ఒకే రోజు మృతి చెందడంతో పలువురిని కంటతడి పెట్టించింది. సోమవారం మిర్యాలలో అంత్యక్రియలు నిర్వహించారు.