హైదరాబాద్ సిటీబ్యూరో/అంబర్‌పేట, జూన్ 25 (నమస్తే తెలంగాణ): ‘ఆన్లైన్లో శృంగారం చేస్తారు.. ఆ వీడియోలను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు.. ఆ తర్వాత వాటికి డబ్బులు వసూలు చేస్తారు. అలాకాకుండా ఆన్లైన్లో లైవ్‌గా చూడాలంటే అందుకోరేటు ఉంటుంది. అది చెల్లిస్తే లైవ్‌లింక్ వస్తుంది. రాత్రివేళ హెచ్డీ కెమెరాలతో లైవ్‌గా ఆ ఇద్దరి రాసలీలలను డబ్బులు చెల్లించిన వారికి చూపిస్తారు. ఇదంతా ఎక్కడో జరుగుతుందనుకుంటే పొరపాటే.
హైదరాబాద్ నగరం నడిమధ్యలో జరుగుతున్న బాగోతమిది. ఈ ఉదంతానికి సంబంధించి ఓ జంటను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాగ్‌అంబర్‌పేట, మల్లికార్జుననగర్‌లో జరుగుతున్న ఈ దందా సమాజపు వికృత పోకడలకు, పెరుగుతున్న పెడ ధోరణులకు ఉదాహరణ. అయితే ఈ దందా చేస్తున్నది స్వయంగా భార్యాభర్తలే! ఓ అశ్లీల వెబ్సైట్లో తమ శృంగారం వీడియోలు అప్లోడ్ చేసి రిజల్ట్ చూశారు.
తమకు తెలిసిన యువకులకు ఆ లింక్‌లు పంపారు. ఈ దందాలో డబ్బులు బాగానే వస్తుండటంతో సెక్స్ కంటెంట్, బోల్డ్సీన్ల పరంపరతో వీక్షకుల సంఖ్యను పెంచుకున్నారు. రోజుకో కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తూ..ఆన్లైన్లో సెక్స్చాటింగ్తో ఆకట్టుకుంటున్నట్టు తెలిసింది. ఆ దంపతులను పట్టుకున్న సమయంలో అక్కడ ఉన్న సెటప్ చూసి ఆశ్చర్యపోయినట్టు ఒక పోలీస్ అధికారి చెప్పారు.
నగరంలో కార్డ్రైవర్గా పనిచేస్తున్న ఓ వ్యక్తి తన భార్యతో కలిసి సాగిస్తున్న ఈ వ్యవహారం టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్‌కు తెలియడంతో మొత్తం బట్టబయలైంది. ఆ దంపతులు తమ ఇంటి మిద్దెపైనే పరదాలు కట్టి హెచ్డీ కెమెరాలతో తమ శృంగార సీన్లను చిత్రీకరిస్తారు. ఆ రికార్డింగ్ వీడియోలను వెబ్సైట్లో పెడతారు. ఆ వీడియోలు చూడాలంటే రూ.300 నుంచి రూ.500 వరకు చార్జ్ చేస్తారు.
ఆన్లైన్ మాధ్యమం ద్వారా లైవ్‌లో వీరి శృంగారం చూడాలంటే రూ.2 వేల వరకు వసూలు చేసేవారని పోలీసులు తెలిపారు. కొన్ని నెలలుగా ఈ తతంగం సాగిస్తున్నా బయటకు పొక్కకుండా వారు జాగ్రత్తపడ్డారు. అయితే వీరి లైవ్సెక్స్కు వీక్షకుల సంఖ్య పెరగడంతో ఆ నోటా ఈ నోటా ఈ సంగతి ఓ టాస్క్‌ఫోర్స్ కానిస్టేబుల్‌కు చేరింది. ఆయన తమ ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు.
ఈ శృంగార వ్యవహారాన్ని ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇంటిపై దాడి చేసి, దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వారు ఉపయోగించిన కెమెరాలు, ఇతర పరికరాలు స్వాధీనం చేసుకుని ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం అంబర్‌పేట పోలీసులకు వీరిని అప్పగించినట్టు తెలిసింది.