
ఖమ్మం, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ర్టానికి కంచుకోటగా ఉన్న టీఆర్ఎస్ను ఢీకొనడం ఎవరితరమూ కాదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నాయకత్వమే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని, దేశం చూపు కేసీఆర్ వైపే ఉన్నదని ఆయన స్పష్టంచేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా మధిరలోని ప్రభు త్వ జూనియర్ కళాశాల మైదానంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అధ్యక్షతన జరిగిన మధిర నియోజకవర్గ టీఆర్ఎస్ సంస్థాగత కమిటీల బాధ్యుల ప్రమాణ స్వీకారంలో మంత్రి మాట్లాడారు. ఉద్యమ నాయకుడే పాలనాదక్షుడైతే ఫలితాలు ఎలా ఉంటాయో, అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందో దేశంలోని అన్ని రాష్ర్టాలూ పరిశీలిస్తున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభంజనం సృష్టిస్తుందని జోస్యం చెప్పారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మెజారిటీ స్థానాలు గెలిచి టీఆర్ఎస్ సత్తా చూపిస్తామని చెప్పారు. కార్యకర్తలను కనిపెట్టుకొని ఉండేది టీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతున్నదని వెల్లడించారు. వ్యూచర్ ఆఫ్ తెలంగాణ మంత్రి కేటీఆరేనని, కేటీఆర్‌ను భవిష్యత్తులో అత్యున్నత స్థానంలో చూసుకుందామని పేర్కొన్నారు. ఆయన్ను అలా చూడాలంటే ప్రతి కార్యకర్త పార్టీ కోసం అహర్నిశలూ శ్రమించాలని పిలుపునిచ్చారు.
అనేక రాష్ర్టాలు ఆశ్చర్యపోతున్నాయి: ఎంపీ నామా
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి అనేక రాష్ర్టాలు ఆశ్చర్యపోతున్నాయని టీఆర్ఎస్ లోకసభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. ప్రతి ఇంటికీ మంచినీరు అందజేస్తున్న రాష్ట్రం ఏదని తాను లోక్‌సభలో ప్రశ్నిస్తే.. తెలంగాణ మాత్రమేనని కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చిందని గుర్తుచేశారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కార్యకర్తల లక్ష్యం టీఆర్ఎస్ను మరోసారి గెలిపించడమే కావాలని సూచించారు. పదవులు ఉన్నా లేకపోయినా తనలాగా పనిచేయాలన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్‌రెడ్డి సంస్థాగత కమిటీల అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులతో ప్రమాణం చేయించారు.
పేదల కోసం తపించడంలో ఎన్టీఆర్, కేసీఆర్‌ది ఒకటే పంథా
మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
గంధంపల్లిలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ
బయ్యారం, అక్టోబర్ 3: ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేద ప్రజల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, నేడు తెలంగాణలో సీఎం కేసీఆర్ సైతం అదే పంథాను కొనసాగిస్తూ వారి సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కొనియాడారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని గంధంపల్లి బస్టాండ్ సెంటర్లో కొత్తపేట, గంధంపల్లి కమ్మ సంఘం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయగా, ఎమ్మెల్యే హరిప్రియనాయక్తో కలిసి పువ్వాడ, తుమ్మల ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు దేశ రాజకీయాలను ఎంతో ప్రభావితం చేశారన్నారు. తెలుగు వారి గౌరవాన్ని దేశానికి చాటి చెప్పిన మహనీయుడు అని కొనియాడారు. సినీ నటుడిగా, రాజకీయ నేతగా తెలుగు ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకున్నారని తెలిపారు. ఎన్టీఆర్ అంటే సీఎం కేసీఆర్‌కు ఎంతో ఇష్టమన్నారు. కేసీఆర్ ఇచ్చిన అవకాశం వల్లే ఉమ్మడి ఖమ్మం జిల్లాను అభివృద్ధి పథంలో ముందు వరుసలో నిలబెడుతున్నామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ జడ్పీ చైర్పర్సన్ అంగోత్ బిందు, భద్రాద్రి కొత్తగూడెం చైర్మన్ కోరం కనకయ్య, ప్రభుత్వ విప్, కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరికెపుడి గాంధీ, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాత మధు తదితరులు పాల్గొన్నారు.