
కరీంనగర్ : ఉమ్మడి పాలనలో గత ప్రభుత్వాలు క్రీడల పై వివక్ష చూపించాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు..సోమవారం కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్లో జరుగుతున్న 8వ రాష్ట్రస్థాయి తెలంగాణ క్రాస్ కంట్రీ చాంపియన్ షిప్ పోటీలను మంత్రి గంగుల కమలాకర్ సందర్శించారు.
క్రీడాకారులను పరిచయం చేసుకున్న మంత్రి అనంతరం వివిధ విభాగాల్లో విజయం సాధించిన క్రీడాకారులకు ట్రోఫీలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..భవిష్యత్తులో సైతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి తెలంగాణ ఖ్యాతిని దశదిశలా చాటాలని పిలుపునిచ్చారు.

సమైక్య పాలనలో క్రీడల కోసం స్టేడియాలు లేవని.. ఉన్నచోట కనీస సౌకర్యలు ఉండేవి కావన్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్రీడల పై ప్రత్యేక దృష్టిని సారించిందన్నారు. నేటి బాలురను క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రతి విద్యార్థి చదువులతో పాటు, క్రీడల పై కూడా దృష్టిని సారించాలని పిలుపునిచ్చారు.