Minister Ponguleti | హైదరాబాద్, సెప్టెంబర్ 27(నమస్తే తెలంగాణ): మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో సోదాలు జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులకు భారీగా నగదు పట్టుబడినట్టు తెలుస్తున్నది. ఉదయం 8 గంటలకు పొంగులేటి నివాసానికి ఈడీ అధికారులు చేరుకున్నారు. కాసేపు సోదాలు నిర్వహించిన తర్వాత ఈడీ సిబ్బంది ఒక నోట్ల లెక్కింపు యంత్రాన్ని తెప్పించారు. ఆ తర్వాత కొద్ది సేపటికి మరో యంత్రాన్ని తెప్పించారు. ఈ రెండు యంత్రాలతో కాసేపు నోట్ల లెక్కింపు జరిగిన తర్వాత ఈడీ సిబ్బంది మరో నోట్ల లెక్కింపు యంత్రాన్ని పొంగులేటి ఇంట్లోకి తీసుకెళ్లారు.
పొంగులేటి నివాసం బయట ఉన్న విలేకరులు, స్థానికుల ముందే మూడు యంత్రాలు ఇంటి లోపలికి పట్టుకెళ్లారు. పదుల సంఖ్యలో సిబ్బంది, గంటల తరబడి, మూడు యంత్రాలపై నోట్లను లెక్కించాల్సి వచ్చిందంటే పొంగులేటి నివాసంలో ఈడీ అధికారులకు భారీగానే నోట్ల కట్టలు దొరికాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోదాల్లో కోట్లాది రూపాయలు లభించిన సందర్భాల్లోనే ఈడీ అధికారులు ఒకటికి మించి యంత్రాలను వినియోగించాల్సి వస్తుంది. పొంగులేటి నివాసం వద్ద కూడా ఇలాంటి పరిస్థితులే కనిపించాయి. కాగా, ఈడీకి పట్టుబడ్డ నగదులో కొంత విదేశీ కరెన్సీ కూడా ఉందనే ప్రచారం కూడా జరుగుతున్నది. అయితే, ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉన్నది. ఎంత నగదు పట్టుబడిందనే విషయాన్ని ఈడీ అధికారిక ప్రకటన ద్వారా ప్రకటించనుంది.